2030 నాటికి రూ. 3.3 లక్షలకు దేశ తలసరి ఆదాయం!

by Vinod kumar |
2030 నాటికి రూ. 3.3 లక్షలకు దేశ తలసరి ఆదాయం!
X

ముంబై: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత తలసరి ఆదాయం రూ. 2 లక్షల నుంచి 2030 నాటికి 70 శాతం పెరిగి రూ. 3.3 లక్షలకు చేరుకునే అవకాశం ఉందని ఓ నివేదిక తెలిపింది. ఇది భారత ఆర్థికవ్యవస్థ 6 ట్రిలియన్ డాలర్ల జీడీపీతో మధ్య-ఆదాయ ఆర్థికవ్యవస్థగా మారేందుకు సహాయపడుతుంది. అందులో సగానికి పైగా వినియోగం నుంచే వస్తుందని స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంక్ నివేదిక తెలిపింది. 2001లో భారత తలసరి ఆదాయం రూ. 38 వేల నుంచి 2011లో రూ. 1.16 లక్షలకు పెరిగిందని, 2021 నాటికి ఇది రూ. 1.76 లక్షలకు చేరుకుందని నివేదిక పేర్కొంది. అంతేకాకుండా ప్రస్తుతం 2.1 ట్రిలియన్ డాలర్ల వద్ద ఉన్న గృహాల వినియోగం 2030 నాటికి 3.5 ట్రిలియన్ డాలర్లకు పెరగవచ్చని, ప్రస్తుతం జీడీపీలో గృహ వినియోగం 57 శాతం వాటాను కలిగి ఉందని వెల్లడించింది.

మెరుగైన సంస్కరణలు, ఆర్థిక స్థిరత్వం, సానుకూల ఆర్థిక రంగం, కార్పొరేట్ రంగంలో అనుకూల మార్పులు, మౌలిక రంగం వృద్ధికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల నేపథ్యంలో తలసరి ఆదాయం పుంజుకునేందుకు దోహదపడనున్నాయని నివేదిక వివరించింది. నివేదిక ప్రకార్మ, ప్రస్తుతం తెలంగాణ రూ. 2,75,443తో తలసరి ఆదాయంలో ముందుండగా, ఆ తర్వాత కర్ణాటక(రూ. 2.66 లక్షలు), తమిళనాడు(రూ. 2.41 లక్షలు), కేరళ(రూ. 2.30 లక్షలు), ఆంధ్రప్రదేశ్(రూ. 2.07 లక్షలు)తో ముందు వరుసలో ఉన్నాయి. 2030 నాటికి తలసరి ఆదాయంలో గుజరాత్ అగ్రస్థానంలో ఉండనుందని, అనంతరం మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక, హర్యానా, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్టాలు ఉంటాయని నివేదిక పేర్కొంది.

Advertisement

Next Story

Most Viewed