GST: జీవిత, ఆరోగ్య బీమాపై జీఎస్టీ తగ్గించే అవకాశం: నివేదిక

by Harish |   ( Updated:2024-08-08 08:57:21.0  )
GST: జీవిత, ఆరోగ్య బీమాపై జీఎస్టీ తగ్గించే అవకాశం: నివేదిక
X

దిశ, బిజినెస్ బ్యూరో: జీవిత, ఆరోగ్య బీమా ప్రీమియంలపై జీఎస్టీని రద్దు చేయాలంటూ గత కొంత కాలంగా నిరసనలు వ్యక్తం అవుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ విషయంపై CNBC-Awaaz ఆగస్టు 8న ఒక నివేదికలో, త్వరలో పాలసీలపై జీఎస్టీని తగ్గించే అవకాశం ఉందని పేర్కొంది. అయితే పూర్తిగా జీఎస్టీని తొలగించడానికి బదులుగా ప్రస్తుతం ఉన్న 18 శాతం నుంచి దానిని 5 శాతానికి తగ్గించే ప్రతిపాదనల గురించి చర్చలు జరుగుతున్నట్లు నివేదిక వెల్లడించింది. జీవిత, ఆరోగ్య బీమా ప్రీమియంలపై జీఎస్టీని పూర్తిగా మినహాయించేందుకు జీఎస్టీ కమిటీ అనుకూలంగా లేదని సమాచారం. ప్రస్తుతం ప్రీమియంలపై జీఎస్టీ గురించిన ప్రతిపాదనలు కమిటీకి అందాయి. దీనిపై అది త్వరలో తన నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం ఉంది.

ఇదిలా ఉంటే జీవిత, ఆరోగ్య బీమా ప్రీమియంలపై విధించిన 18 శాతం వస్తు సేవల పన్ను (జీఎస్టీ)ని వెనక్కి తీసుకోవాలని కోరుతూ ఇండియా కూటమి పార్లమెంట్‌లో నిరసనలు చేపట్టింది. అంతకుముందు రోడ్డు, రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ కూడా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు, బీమాపై జీఎస్టీని ఉపసంహరించుకోవాలని కోరుతూ లేఖ రాశారు. బుధవారం పార్లమెంట్ సమావేశంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ మాట్లాడుతూ, జీఎస్టీ విధానం అమల్లోకి రాకముందు కూడా అన్ని రకాల బీమాల ప్రీమియంలపై పన్ను విధించే వారని అన్నారు. జీఎస్టీ విధానం అమల్లోకి తెచ్చిన తర్వాత కూడా అదే విధానాన్ని తాము కొనసాగించామని ఆమె తెలిపారు. గత మూడు ఆర్థిక సంవత్సరాల్లో ఆరోగ్య, జీవిత బీమాపై జీఎస్టీ ద్వారా ప్రభుత్వం దాదాపు రూ.24,000 కోట్లు వసూలు చేసింది.

Advertisement

Next Story