MSMEs: ఐదేళ్లలో 75,000కు పైగా ఎంఎస్ఎంఈలు క్లోజ్

by S Gopi |
MSMEs: ఐదేళ్లలో 75,000కు పైగా ఎంఎస్ఎంఈలు క్లోజ్
X

దిశ, బిజినెస్ బ్యూరో: గడిచిన ఐదేళ్ల కాలంలో దేశవ్యాప్తంగా 75,082 ఎంఎస్ఎంఈలూ మూసివేసినట్టు ప్రభుత్వం తెలిపింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఒక్కటే ఫిబ్రవరి ఆఖరు నాటికి కేంద్ర ప్రభుత్వ ఉద్యమ్ పోర్టల్‌లో నమోదు చేసుకున్న సుమారు 35,567 సూక్ష్మ, చిన్న మధ్య తరహా సంస్థలు(ఎంఎస్ఎంఈ) మూతబడ్డాయని కేంద్ర ఎంఎస్ఎంఈ సహాయ మంత్రి రాజ్యసభకు తెలియజేశారు. అందరికీ వ్యాపార నిర్వహణను సులభతరం చేసే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం 2020, జూలై 1న ఉద్యమ్ పోర్టల్‌ను ప్రారంభించిన సంగతి తెలిసిందే. 2024-25లో మూసేసిన ఎంఎస్ఎంఈల సంఖ్య అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో క్లోజ్ అయిన 19,828 కంటే దాదాపు రెట్టింపు కావడం గమనార్హం. అంతేకాకుండా గడిచిన నాలుగేళ్ల కంటే 2024-25లో మూతబడిన మొత్తం ఎంఎస్ఎంఈల సంఖ్యకు దాదాపు సమానం. 2020-21లో 175 ఎంఎస్ఎంఈ కంపెనీలు మూతబడగా, 2021-22లో 6,222, 2022-23లో 13,290, 2023-25లో 19,828 ఎంఎస్ఎంఈ కంపెనీలు కార్యకలాపాలను నిలిపేశాయి. అయితే, ఈ మూసివేతలకు సంబంధించి ఖచ్చితమైన కారణాలను మంత్రి వివరించలేదు. కానీ, 2024-25లో అత్యధికంగా 8,472 ఎంఎస్ఎంఈలతో మహారాష్ట్రలో అత్యధిక మూసివేతలు నమొదయ్యాయి. ఆ తర్వాత తమిళనాడు(4,412), గుజరాత్(3,148), రాజస్థాన్(2898), కర్ణాటక(2010) కంపెనీలు మూతబడ్డాయి. పెట్టుబడి సాయం, టర్నోవర్ పరిమితి బూస్ట్, క్రెడిట్ గ్యారెంటీ పెంపు సహా ఎంఎస్ఎంఈలకు యూనియన్ బడ్జెట్‌లో ప్రభుత్వం అనేక ప్రకటనలు చేస్తున్నప్పటికీ ఈ కంపెనీలు మూతబడుతున్నాయి. ఫిబ్రవరి 28 నాటికి దేశంలోని రాష్ట్రాలు, యూటీలతో కలిపి మొత్తం 6.05 కోట్ల ఎంఎస్ఎంఈలు ఉన్నాయి.

Next Story