ఐపీఓ ప్రక్రియను తాత్కాలికంగా నిలిపేసిన మామాఎర్త్!

by sudharani |
ఐపీఓ ప్రక్రియను తాత్కాలికంగా నిలిపేసిన మామాఎర్త్!
X

ముంబై: ప్రముఖ స్కిన్‌కేర్ స్టార్టప్ మామాఎర్త్ మాతృసంస్థ హొనాసా కన్స్యూమర్ తన ఐపీఓ ప్రక్రియను తాత్కాలికంగా నిలిపేసినట్టు తెలుస్తోంది. గతేడాది డిసెంబర్‌లో కంపెనీ సుమారు రూ. 2,900 కోట్ల నిధులను సమీకరించడానికి మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీకి ఐపీఓ పత్రాలను దాఖలు చేసింది. అయితే, ఇటీవల స్టాక్ మార్కెట్లలో ప్రతికూల పరిస్థితులు కొనసాగుతున్న నేపథ్యంలో ఐపీఓను హోల్డ్‌లో ఉంచాలని నిర్ణయించినట్టు సంబంధిత వ్యక్తులు తెలిపారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా బ్యాంకింగ్ రంగం సంక్షోభ స్థితిని ఎదుర్కొంటుండటంతో స్టాక్ మార్కెట్లలో మదుపర్లు ఆందోళనలో ఉన్నారు.

ఈ సమయంలో పబ్లిక్ ఆఫర్‌ను కొనసాగించడం వల్ల నిధుల సమీకరణ సవాలుగా ఉంటుందని కంపెనీ భావిస్తోంది. మరోవైపు పెట్టుబడిదారులతో జరిగిన ప్రాథమిక చర్చలో కంపెనీ వాల్యూయేషన్‌పై ఇన్వెస్టర్లు సానుకూలంగా లేరని సమాచారం. మామాఎర్త్ సీఈఓ వరుణ్ అలఘ్ ఇటీవల ఓ ప్రకటనలో తాము స్వల్పకాలానికి కంపెనీ విలువను నిర్ణయించలేదని, దీర్ఘకాల లక్ష్యంతో ఉన్నట్టు చెప్పారు. కాగా, కంపెనీ ఐపీఓ కోసం సెబీ నుంచి ఆమోదం పొందేందుకు, తుది ఐపీఓ పత్రాలను ఫైల్ చేసేందుకు డిసెంబర్ వరకు గడువు ఉంది. ఒకవేళ మార్కెట్ల ధోరణి మెరుగ్గా ఉంటే గనక అక్టోబర్ నాటికి కంపెనీ ఐపీఓకు వస్తుందని మార్కెట్ వర్గాలు పేర్కొన్నాయి.

Advertisement

Next Story

Most Viewed