ఓడీఓపీ ఉత్పత్తులకు పన్ను రహిత అవకాశాల అన్వేషణ: పీయూష్ గోయల్!

by srinivas |
ఓడీఓపీ ఉత్పత్తులకు పన్ను రహిత అవకాశాల అన్వేషణ: పీయూష్ గోయల్!
X

న్యూఢిల్లీ: భారత్ ఎగుమతులను ప్రోత్సహించేందుకు వన్ డిస్ట్రిక్ట్-వన్ ప్రోడక్ట్(ఓడీఓపీ) ద్వారా ఎంపిక చేసిన ఉత్పత్తులకు పన్ను రహిత అవకాశాలను అందించాలని చూస్తున్నట్టు వాణిజ్య, పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ సోమవారం ఓ ప్రకటనలో వెల్లడించారు. దీనివల్ల బంగారు ఆభరణాలు, బొమ్మలు, హస్తకళలు, చేనేత ఉత్పత్తులకు అపారమైన అవకాశాలు ఉంటాయని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రభుత్వం స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాల్లో స్థానిక ఉత్పత్తులన్నింటికీ డ్యూటీ-ఫ్రీ(పన్ను రహితం) యాక్సెస్ ద్వారా అంతర్జాతీయ మార్కెట్‌కు విస్తరించాలనే లక్ష్యంతో ఉన్నామని ఆయన పేర్కొన్నారు.

స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంలో రెండు లేదా అంతకంటే ఎక్కువ దేశాలు ద్వైపాక్షిక వాణిజ్య సంబంధాలను బలోపేతం చేసేందుకు వీలైనన్ని ఎక్కువ వస్తువులపై సుంకాలను గణనీయంగా తగ్గించడం లేదా తొలగించాయని పీయూష్ గోయెల్ వివరించారు. యూకే, కెనడా, యూరప్ సహా పలు దేశాలతో వాణిజ్య ఒప్పందాల కోసం భారత్ చర్చలు జరుపుతోంది. ఎగుమతుల సామర్థ్యం ఉన్న ఉత్పత్తులను గుర్తించడం, ఈ ఉత్పత్తులను ఎగుమతి చేసేందుకు ఉన్న అడ్డంకులను పరిష్కరించడం, తయారీని పెంచేందుకు స్థానిక ఎగుమతిదారులు/తయారీదారులకు మద్దతివ్వడం, విదేశాల్లో మార్కెట్‌ను సృష్టించడం ద్వారా దేశంలోని ప్రతి జిల్లాను ఎగుమతి కేంద్రగా మార్చడమే లక్ష్యంగా ప్రభుత్వం ప్రణాళిక కలిగి ఉందని పీయూష్ గోయల్ వెల్లడించారు.

Advertisement

Next Story