Stock Market: స్టాక్ మార్కెట్ల పతనంతో ఎల్ఐసీకి రూ. 84 వేల కోట్ల నష్టాలు

by S Gopi |
Stock Market: స్టాక్ మార్కెట్ల పతనంతో ఎల్ఐసీకి రూ. 84 వేల కోట్ల నష్టాలు
X

దిశ, బిజినెస్ బ్యూరో: వరుసగా నష్టాలను ఎదుర్కొంటున్న స్టాక్ మార్కెట్లు ప్రభుత్వ రంగ బీమా సంస్థ ఎల్ఐసీని కూడా దెబ్బతీశాయి. గడిచిన కొన్ని వారాలుగా భారతీయ ఈక్విటీ మార్కెట్లు దాదాపు 10 శాతం క్షీణించాయి. ప్రధానంగా మన మార్కెట్ల నుంచి విదేశీ ఇన్వెస్టర్లు పెద్ద మొత్తంలో నిధులను వెనక్కి తీసుకెళ్తుండటంతో బలహీనపడుతున్నాయి. దీనికితోడు ఇటీవల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పరస్పర సుంకాలను విధించనున్నట్టు ప్రకటించడం, డాలర్ విలువ బలపడుతుండటం వంటి పరిణామాలు మార్కెట్లపై ఒత్తిడి పెంచాయి. ఫలితంగా పెట్టుబడిదారులు భారీగా సంపదను కోల్పోతున్నారు. ఈ క్రమంలోనే ఎల్ఐసీ సైతం మార్కెట్ల ప్రభావంతో కేవలం నెలన్నర కాలంలో రూ. 84,247 కోట్లు కోల్పోయింది. ఈ మొత్తం ఎల్ఐసీ మొత్తం పెట్టుబడుల్లో 5.7 శాతానికి సమానం. గణాంకాల ప్రకారం, 2024, డిసెంబర్ త్రైమాసికం నాటికి లిస్టెడ్ కంపెనీలలో ఎల్ఐసీ హోల్డింగ్స్ విలువ రూ. 14.72 లక్షల కోట్లు ఉండగా, ప్రస్తుత ధరల ప్రకారం (ఫిబ్రవరి 18, 2025) వాటి విలువ రూ. 13.87 లక్షల కోట్లకు తగ్గాయి. కనీసం 1 శాతం వాటా ఉన్న 330 కంపెనీల నుంచి సేకరించిన డేటా ఆధారంగా ఈ నష్టాన్ని అంచనా వేశారు. బీఎస్ఈలో లిస్టెడ్ కంపెనీల మొత్తం మార్కెట్ విలువలో ఈ కంపెనీలకు 66 శాతం వరకు వాటా ఉన్నాయి. కాగా, బుధవారం ట్రేడింగ్‌లో భారత ఈక్విటీ మార్కెట్లు స్వల్ప నష్టాలను నమోదు చేశాయి. సెన్సెక్స్ ఇండెక్స్ 28.21 పాయింట్లు నష్టపోయి 75,939 వద్ద, నిఫ్టీ 12.40 పాయింట్లు నష్టపోయి 22,932 వద్ద ముగిశాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 86.88 వద్ద ఉంది.



Next Story