అదానీ మేనేజ్‌మెంట్‌తో ఎల్ఐసీ చర్చలు సంతృప్తికరం: ఎంఆర్ కుమార్!

by Vinod kumar |
అదానీ మేనేజ్‌మెంట్‌తో ఎల్ఐసీ చర్చలు సంతృప్తికరం: ఎంఆర్ కుమార్!
X

న్యూఢిల్లీ: అదానీ గ్రూప్ టాప్ మేనేజ్‌మెంట్‌తో సమావేశం అనంతరం వారి వివరణ సంతృప్తికరంగా ఉందని ప్రభుత్వ రంగ బీమా దిగ్గజం ఎల్ఐసీ ఛైర్‌పర్సన్ ఎంఆర్ కుమార్ ఆదివారం ప్రకటనలో తెలిపారు. అదానీ గ్రూప్‌తో సమావేశం జరిగింది. దీని గురించి వివరంగా చెప్పకపోయినప్పటికీ అదానీ గ్రూప్‌తో జరిగిన సమావేశంపై సంతోషంగా ఉన్నామని చెప్పారు. గత నెల త్రైమాసిక ఫలితాల వెల్లడి అనంతరం ఎంఆర్ కుమార్ ఇటీవల అదానీ షేర్ల పతనం గురించి స్పందిస్తూ ఎల్ఐసీ త్వరలో సంస్థ అధికారులతో చర్చిస్తారని చెప్పిన సంగతి తెలిసిందే.

అదానీ గ్రూప్ స్టాక్ మానిప్యూలేషన్, అకౌంట్ మోసాలకు పాల్పడుతోందని హిండెన్‌బర్గ్ నివేదిక ఆరోపణల నేపథ్యంలో గత కొన్ని వారాలుగా అదానీ కంపెనీల షేర్లు భారీగా నష్టపోయాయి. అయితే అదానీ షేర్లలో పెట్టుబడి ద్వారా ఎల్ఐసీ సంపద కోల్పోయిందనే ఆందోళన ఇన్వెస్టర్లలో నెలకొంది. ఈ క్రమంలో ప్రస్తుత పరిణామాలపై సంస్థతో ఎల్ఐసీ చర్చించింది. షేర్‌హోల్డర్లు, పాలసీదారులు ఎలాంటి ఆందోళన పడాల్సిన అవసరం లేదు.

అదానీ స్టాక్స్ నష్టాల వల్ల షేర్‌హోల్డర్లతో పాటు పాలసీహోల్డర్లకు 1 శాతం కూడా రిస్క్ ఉండదు. పెట్టుబడులపై ఎలాంటి ప్రభావం ఉండదని, ఈ సమస్య సముద్రంలో నీటిబొట్టు లాంటిదని ఎంఆర్ కుమార్ వివరణ ఇచ్చారు. కాగా, ఎల్ఐసీ సంస్థ అదానీ గ్రూపులోని 7 లిస్టెడ్ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టింది. అదానీ గ్రీన్ ఎనర్జీలో 1.28 శాతం, అదానీ పోర్ట్స్‌లో 9.14 శాతం, మిగిలిన వాటిలో కొంతమేర వాటాలను కలిగి ఉంది.

Advertisement

Next Story

Most Viewed