2022-23లో రికార్డు స్థాయి లాభాలను ఆర్జించనున్న పీఎస్‌బీలు!

by Vinod kumar |   ( Updated:2023-04-10 14:26:57.0  )
2022-23లో రికార్డు స్థాయి లాభాలను ఆర్జించనున్న పీఎస్‌బీలు!
X

న్యూఢిల్లీ: ఈ ఏడాది మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో దేశీయ బ్యాంకులు మెరుగైన ఆదాయ వివరాలను వెల్లడించే అవకాశం ఉందని బ్యాంకింగ్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 2022-23 ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ రంగ బ్యాంకుల(పీఎస్‌బీ) లాభాలు రికార్డు స్థాయిలో రూ. లక్ష కోట్లకు చేరుకోవచ్చని అంచనా. మెరుగైన రుణాల వృద్ధి కారణంగా లాభాలు పెరగనున్నాయని ఒక సీనియర్ బ్యాంకు అధికారి తెలిపారు. ప్రభుత్వ రంగ దిగ్గజం ఎస్‌బీఐ గత ఆర్థిక సంవత్సరం మొత్తానికి రూ. 40 వేల కోట్ల కంటే ఎక్కువ లాభాలను ఆర్జించే అవకాశాలు ఉన్నాయి. మిగిలిన పీఎస్‌బీలు సైతం ఆరోగ్యకరమైన లాభాలను సాధించగలవన్నారు.

తగ్గిన మొండి బకాయిలు, రెండంకెల క్రెడిట్ వృద్ధి, పెరుగుతున్న వడ్డీ రేట్ల ద్వారా బ్యాంకుల ఆదాయం గణనీయంగా నమోదు కానుందని పంజాబ్ అండ్ సింధ్ ఎండీ స్వరూప్ కుమార్ అన్నారు. గణాంకాల ప్రకారం, 2022-23 మొదటి తొమ్మిది నెలల్లో మొత్తం 12 పీఎస్‌బీలు రూ. 70,166 కోట్ల లాభాలను ఆర్జించాయి. అంతకుముందు ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో నమోదైన రూ. 43,983 కోట్లతో పోలిస్తే 43 శాతం పెరిగింది. ఈ నేపథ్యంలో నాలుగో త్రైమాసికంలోనూ ఇదే స్థాయిలో లాభాలు రావొచ్చని, పీఎస్‌బీలు దాదాపు రూ. 30 వేల కోట్ల వరకు నమోదయ్యే అవకాశం ఉందని స్వరూప్ కుమార్ పేర్కొన్నారు.

Also Read..

ఎస్‌యూవీ విభాగంలో రెట్టింపు అమ్మకాల లక్ష్యం: మారుతీ సుజుకి!

Advertisement

Next Story