ఈ కామర్స్ హబ్‌ల అభివృద్ధికి 100 రోజుల ఎజెండాలో కీలక ప్రతిపాదనలు

by Disha Web Desk 17 |
ఈ కామర్స్ హబ్‌ల అభివృద్ధికి 100 రోజుల ఎజెండాలో కీలక ప్రతిపాదనలు
X

దిశ, బిజినెస్ బ్యూరో: దేశం నుంచి ఎగుమతులను పెంచడానికి ఈ కామర్స్ హబ్‌లను అభివృద్ధి చేయడానికి వాణిజ్య మంత్రిత్వ శాఖ కొత్త ప్రభుత్వం కోసం రూపొందిస్తున్న 100-రోజుల ఎజెండాలో కీలక ప్రతిపాదనలు ఉండనున్నాయి . ఈ రంగంలో భారీ ఎగుమతి అవకాశాలు ఉన్నందున ఈ-కామర్స్ భాగస్వామ్యాల దారా ఎగుమతులను ప్రోత్సహించేందుకు 100-రోజుల రోడ్‌మ్యాప్‌లో రాయితీలు, సౌలభ్యం వంటి ప్రతిపాదనలు అందిస్తున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించిన గ్రౌండ్ వర్క్‌ను DGFT, RBI, ఆర్థిక మంత్రిత్వ శాఖతో కలిసి రూపొందిస్తుంది. కొత్త ప్రభుత్వం కోసం 100 రోజుల ప్రణాళికను సిద్ధం చేయాలని అధికారులు మంత్రిత్వ శాఖలను కోరినందున దీనికి ప్రాముఖ్యత ఏర్పడింది.

ఏడు దశల లోక్‌సభ ఎన్నికలు ఏప్రిల్ 19న ప్రారంభమయ్యాయి, ఓట్ల లెక్కింపు జూన్ 4న జరగనుంది. ఫలితాలు వెలువడి కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దీనిని అమల్లోకి తీసుకొచ్చి 100 రోజుల్లో అనుకున్న లక్ష్యాన్ని పూర్తి చేయనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ-కామర్స్ మాధ్యమాల ద్వారా ఎగుమతులను మరింత ప్రోత్సహించేందుకు ఈ హబ్‌లు సహాయపడతాయని ఒక అధికారి తెలిపారు.

ఈ హబ్‌లలో వేర్‌హౌసింగ్ సౌకర్యాలు, కస్టమ్స్ క్లియరెన్స్, రిటర్న్స్ ప్రాసెసింగ్, లేబులింగ్, టెస్టింగ్, రీప్యాకేజింగ్ వంటివి ఉంటాయి. వీటి నుంచి కార్గో ఎగుమతులు- దిగుమతులు సులభతరం అవుతాయి. గత ఏడాది, క్రాస్-బోర్డర్ ఈ-కామర్స్ వ్యాపారం 800 బిలియన్ డాలర్లు కాగా, ఇది 2030 నాటికి 2 ట్రిలియన్ డాలర్లకు చేరుతుందని అంచనా వేశారు. భారత ప్రభుత్వం మాత్రం 2030 నాటికి 1 ట్రిలియన్ డాలర్ల సరుకుల ఎగుమతుల లక్ష్యాన్ని నిర్దేశించుకుంది.

Next Story