ధరణి పెండింగ్ దరఖాస్తులను పరిష్కరించాలి

by Sridhar Babu |   ( Updated:2024-05-21 16:11:14.0  )
ధరణి పెండింగ్ దరఖాస్తులను పరిష్కరించాలి
X

దిశ, సంగారెడ్డి : పెండింగ్ ధరణి దరఖాస్తులను పరిష్కరించాలని, కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం సేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ క్రాంతి అధికారులను ఆదేశించారు. రెవెన్యూ , పౌర సరఫరా శాఖల అధికారులు , డీఆర్డీ ఓ అధికారులతో మంగళవారం సాయంత్రం టెలీకాన్ఫెరెన్స్ నిర్వహించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ దరఖాస్తుల పరిశీలన పై రెవెన్యూ అధికారులతో మాట్లాడారు. పెండింగ్ లో ఉన్న దరఖాస్తులను గడువు లోపల పరిష్కరించాలని అన్నారు.

ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించి అవసరమైతే ఫీల్డ్ ఇన్స్పెక్షన్ చేసి ఆన్లైన్ లోనే కాకుండా ఫైల్స్ రూపంలో కూడా నిర్వహించాలని తహసీల్దార్లను ఆదేశించారు. రిపోర్టులను పరిశీలించి సంబంధిత నివేదికలతో పూర్తిస్థాయిలో కలెక్టరేట్ కు సమర్పించాలని అన్నారు. పెండింగ్‌ సమస్యలు పరిష్కరించేలా ప్రత్యేక చర్యలు చేపట్టాలని, చాలా బాధ్యతతోపాటు వేగవంతంగా పూర్తి చేయాలన్నారు. ధరణి దరఖస్తులను అందుబాటులో ఉన్న రికార్డుల ద్వారా పరిశీలించి పూర్తి చేయాలన్నారు. మాడ్యూల వారీగా ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని, ప్రతి దరఖాస్తును పరిష్కరించేలా చర్యలు చేపట్టాల్సి ఉంటుందని తెలిపారు.

ధాన్యం సేకరణ ప్రక్రియను వేగంగా పూర్తి చేయాలి ..

కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం సేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. ఈ రోజు అందోల్ డివిజన్లలోని మాన్ సాన్ పల్లి , కంసాన్ పల్లి గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలు పరిశీలించడం జరిగిందని , కొన్ని సెంటర్ లలో మాయిశ్చర్ వచ్చినా కూడా ఎందుకు తూకం వేయడం లేదని, అధికారులను ప్రశ్నించారు. మాయిశ్చర్ వచ్చిన కొనుగోలు కేంద్రాలలో ధాన్యం సేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశించారు. అందోల్ మండలం అన్నారం,

జిన్నారం ఐకేపీ, పుల్కకల్ కల్హేర్ పీఏసీఎస్, డీసీఎంఎస్ లలో పెండింగ్ ఉన్న ధాన్యం సేకరణ పూర్తి చేయాలన్నారు. అవసరమైనన్ని లారీలు ఏర్పాటు చేసి ధాన్యం సేకరణ ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశించారు. రైతులకు టోకెన్ వారీగా ధాన్యం కాంటా వేయాలని సూచించారు. మిల్లుల వద్ద లారీలు నిలిచి ఉండకుండా ఎప్పటికప్పుడు దిగుమతి చేసుకునేలా పకడ్బందీ పర్యవేక్షణ జరపాలన్నారు. కొనుగోలు కేంద్రాలలో సరిపడా టార్పాలిన్లు, గన్నీ బ్యాగులు అందుబాటులో ఉండేలా ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

Advertisement

Next Story