బడ్జెట్-2024..మూలధన వ్యయంతో రైల్వేకు కొత్త శక్తి

by S Gopi |
బడ్జెట్-2024..మూలధన వ్యయంతో రైల్వేకు కొత్త శక్తి
X

దిశ, బిజినెస్ బ్యూరో: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఈ ఏడాది లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ఈసారి తాత్కాలిక బడ్జెట్ రూపకల్పన ఉంటుంది. అనంతరం కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యాక పూర్తిస్థాయి బడ్జెట్ ప్రకటన ఉండనుంది. ఈ నేపథ్యంలో భారతీయ రైల్వేకు ఈ మధ్యంతర బడ్జెట్‌లో మూలధన వ్యయం భారీగా ఉండొచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. జాతీయ రవాణా వ్యవస్థలో గణనీయమైన మార్పును తెచ్చే లక్ష్యంతో ఆర్థిక మంత్రి మరిన్ని నిధులు రైల్వేకు కేటాయించవచ్చు. ప్రధానంగా ఆధునిక, హై-స్పీడ్ రైళ్లు, మెరుగైన భద్రత చర్యలు చేపట్టవచ్చని భావిస్తున్నారు. గత 2023-24(బడ్జెట్ అంచనా)లో కేటాయించిన రూ. 2.4 లక్షల కోట్లతో పోలిస్తే ఈసారి 2024-25 మధ్యంతర బడ్జెట్లో రైల్వే కోసం రూ. 2.8-3 లక్షల కోట్ల వరకు కేటాయించే అవకాశం ఉంది.

రైల్వేల ఆధునీకరణకు అధిక ప్రాధాన్యత ఇస్తూ రాబోయే బడ్జెట్‌లో మూలధన వ్యయం ఊపందుకోవచ్చని ఇక్రా, ఎలారా, ప్రభుదాస్ లిల్లాధర్‌కు చెందిన అనలిస్టులు భావిస్తున్నారు. రోడ్లు, హైవేలు, రైల్వే వంటి మౌలిక సదుపాయాల రంగాలకు ఎక్కువ కేటాయింపులు ఉండనున్నాయి. అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీని ప్రోత్సహించడంపై ప్రభుత్వం దృష్టి సారించి, ఆర్అండ్‌డీని మరింత మెరుగుపరిచే చర్యలు ఆశిస్తున్నామని ఇక్రా తెలిపింది. వచ్చే ఆర్థిక సంవత్సరానికి మూలధన వ్యయం 20 శాతం పెరగవచ్చని ఎలారా కేపిటల్ అభిప్రాయపడింది. ఇది బడ్జెట్ పెరుగుదల 37.4 శాతం కంటే తక్కువగా ఉంది.

మరోవైపు, 2024-2025లో రాష్ట్రాలకు వడ్డీ రహిత కాపెక్స్ రుణాలు కొనసాగుతాయని రేటింగ్ ఏజెన్సీ ఇక్రా తెలిపింది. గత బడ్జెట్‌లో ఇది రూ.1.3 లక్షల కోట్లుగా ఉంది. కేంద్రం నుంచి రాష్ట్రాలకు ఏడాదికి రూ. 30,000 కోట్ల రుణం, కేంద్ర మొత్తం మూలధన వ్యయంలో 60 శాతం రోడ్లు, రైల్వేలు, రక్షణ రంగాలకు కేటాయించాలని భావిస్తున్నట్టు ఇక్రా అభిప్రాయపడింది. ప్రత్యేక సరుకు రవాణా కారిడార్లు, డబ్లింగ్, విద్యుదీకరణ, హై-స్పీడ్ రైళ్ల ద్వారా సామర్థ్యాన్ని మెరుగుపరిచేందుకు కేంద్రం పెట్టుబడులు పెడుతుంది.

రైల్వేలో అత్యాధునిక టెక్నాలజీ సహకారంతో 400 వందే భారత్ రైళ్లను ఉత్పత్తి చేయాలని కేంద్రం లక్ష్యాన్ని నిర్దేశించింది. ప్రస్తుతం దేశంలో 41 వందే భారత్ రైళ్లు ఉన్నాయి. ఇప్పటికే భారతీయ రైల్వే కొత్త మార్పులు జరుగుతున్నాయి. ఈ విస్తృతమైన పనులు సజావుగా సాగేందుకు 2024-25లో కేంద్రం అదనంగా రూ. 40 వేల కోట్ల నుంచి రూ. 60 వేల కోట్లను రైల్వే కోసం కేటాయించాలని ఇక్రా సూచించింది.

Advertisement

Next Story

Most Viewed