ఉద్యోగులకు బోనస్‌ ప్రకటించిన ఇండిగో

by S Gopi |   ( Updated:2024-05-02 14:18:06.0  )
ఉద్యోగులకు బోనస్‌ ప్రకటించిన ఇండిగో
X

దిశ, బిజినెస్ బ్యూరో: దేశీయ అతిపెద్ద విమానయాన సంస్థ ఇండిగో తన ఉద్యోగులకు బోనస్‌ను ప్రకటించింది. 2023-24 పూర్తి ఆర్థిక సంవత్సరానికి సంస్థ లాభాలను సాధించే అవకాశాలు ఉన్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. ఉద్యోగులకు ప్రకటించిన బోనస్ వారి నెలన్నర జీతానికి సమానంగా ఉండనున్నట్టు తెలుస్తోంది. చివరిసారిగా ఇండిగో 2018-19 ఆర్థిక సంవత్సరంలో లాభాలను నమోదు చేసింది. ఆ తర్వాత కొవిడ్-19 మహమ్మారి కారణంగా మొత్తం పరిశ్రమ దెబ్బతినడంతో సంస్థ ఇబ్బందుల్లో పడింది. 'కరోనా సమయంలో సంభవించిన నష్టాలు తమపై ఎక్కువ ప్రభావాన్ని ఎదుర్కొన్నాం. అంతకుముందు పొందిన లాభాలు కూడా కోల్పోయాం. 2022 ద్వితీయార్థంలో రికవరీ అవ్వడం ప్రారంభించాం. అప్పటి నుంచి బలమైన పనితీరు ద్వారా మెరుగ్గా రాణిస్తున్నామని' ఇండిగో చీఫ్ హెచ్ఆర్ ఆఫీసర్ సుఖ్‌జిత్ పస్రిచా ఉద్యోగులకు పంపిన మెయిల్‌లో పేర్కొన్నారు. కంపెనీలోని విధులు, పాత్రల ఆధారంగా వార్షిక బోనస్‌లను అందించడం జరుగుతుంది. ఆర్థిక ఫలితాల ఆధారంగా బోనస్ చెల్లింపుల ప్రక్రియ జరుగుతుందని ఆయన తెలిపారు.

Advertisement

Next Story