పదేళ్లలో రూ. 8.3 లక్షల కోట్లకు యూజ్‌డ్ కార్ల మార్కెట్

by S Gopi |
పదేళ్లలో రూ. 8.3 లక్షల కోట్లకు యూజ్‌డ్ కార్ల మార్కెట్
X

దిశ, బిజినెస్ బ్యూరో: దేశంలో వేగంగా పెరుగుతున్న మధ్యతరగతి, అధిక ఆదాయం కారణంగా రాబోయే 10 ఏళ్లలో భారత యూజ్‌డ్ కార్ల మార్కెట్ 100 బిలియన్ డాలర్ల మార్కును చేరుకుంటుందని ప్రముఖ కార్స్24 సహ-వ్యవస్థాపకుడు, సీఈఓ విక్రమ్ చోప్తా అంచనా వేశారు. మన కరెన్సీలో ఈ విలువ రూ. 8.3 లక్షల కోట్లు. వినియోగదారులు తరచుగా తమ కార్లను అప్‌గ్రేడ్ చేయాలని భావిస్తుండటంతో ఈ మార్కెట్ వృద్ధి వేగంగా ఉందని విక్రమ్ అభిప్రాయపడ్డారు. కంపెనీ అంతర్గతంగా చేపట్టిన అధ్యయనం ప్రకారం, ఏడాదికి సగటున 15 శాతం వృద్ధితో 2023లో రూ. 2 లక్షల కోట్లుగా 2034 నాటికి రూ. 8.3 లక్షల కోట్లకు పెరుగుతుందని విక్రమ్ చోప్రా తెలిపారు.

పట్టణీకరణ, పెరుగుతున్న మధ్యతరగతితో పాటు వివిధ అంశాలు యూజ్‌డ్ కార్ల మార్కెట్‌కు కలిసొస్తోంది. ఈ పరిణామాలు వినియోగదారుల ప్రాధాన్యతలను మారుస్తోంది. ముఖ్యంగా కస్టమర్లు సరసమైన మొబిలిటీ పరిష్కారాలకు ఆసక్తి చూపిస్తున్నారని విక్రమ్ వివరించారు. ఎనిమిదేళ్ల క్రితం తాము కార్స్24 ప్రారంభించినప్పుడు యూజ్‌డ్ కార్ల మార్కెట్ పరిమాణం సుమారు రూ. 80 వేల నుంచి రూ. 1.20 లక్షల కోట్లుగా ఉండేది. అంతకుముందు కంటే గత మూడు-నాలుగేళ్లలో ఈ మార్కెట్ వేగంగా పెరుగుతోంది. యూఎస్, చైనా, యూరప్ లాంటి దేశాల్లో 80-90 శాతం మంది వద్ద కార్లు ఉన్నాయి, కానీ భారత్‌లో 8 శాతం వద్ద మాత్రమే కార్లు ఉన్నాయి. కాబట్టి భవిష్యత్తులో దేశీయ మార్కెట్లలో అవకాశాలు మెండుగా ఉన్నాయని విక్రమ్ పేర్కొన్నారు.

Advertisement

Next Story