మార్చిలో స్వల్పంగా తగ్గిన సేవా రంగ వృద్ధి!

by Harish |
మార్చిలో స్వల్పంగా తగ్గిన సేవా రంగ వృద్ధి!
X

న్యూఢిల్లీ: ఈ ఏడాది మార్చిలో సేవల రంగ సూచీ వృద్ధి స్వల్పంగా తగ్గింది. ఫిబ్రవరిలో 12 ఏళ్ల గరిష్ఠానికి చేరిన తర్వాత గత నెలలో ఎస్అండ్‌పీ గ్లోబల్ ఇండియా సర్వీసెస్ పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్ 57.8 పాయింట్లకు చేరింది. ఫిబ్రవరిలో ఇది 59.4 పాయింట్లుగా నమోదైంది. అయితే, సానుకూల డిమాండ్‌తో పాటు కొత్త వ్యాపార ఆర్డర్లు, ఇన్‌పుట్ ఖర్చులున్నప్పటికీ ఉత్పత్తి ఊపందుకోవడం సేవల పీఎంఐ బలమైన వృద్ధికి కారణమని ఎస్అండ్‌పీ నివేదిక తెలిపింది. దానివల్ల వరుసగా 20వ నెలలో సేవల రంగం కీలకమైన 50 పాయింట్ల స్థాయి ఎగువనే ఉంది.

పీఎంఐ సూచీ 50 పాయింట్లకు పైన ఉంటే వృద్ధిగానూ, 50కి దిగువన నమోదైతే క్షీణతగానూ పరిగణిస్తారనే విషయం తెలిసిందే. అంతర్జాతీయంగా భారత సేవలకు ఉన్న డిమాండ్ కారణంగా కొత్త వ్యాపార ఆర్డర్లు కీలక మద్దతిచ్చాయని ఎస్అండ్‌పీ గ్లోబల్ ఎకనమిక్స్ అసోసియేట్ డైరెక్టర్ పొలియానా డి లిమా అన్నారు. ఇక, సేవల రంగంలో ఉద్యోగాలు గత నెలలో నెమ్మదించాయి. నిర్వహణ సామర్థ్యాలపై ఒత్తిడి లేకపోవడం, వృద్ధి నెమ్మదించడం వల్ల ఈ రంగంలో నియామక కార్యకలాపాలు తగ్గాయని డి లిమా పేర్కొన్నారు.

Advertisement

Next Story