31 నెలల గరిష్ఠానికి తయారీ పీఎంఐ!

by Hamsa |   ( Updated:2023-06-01 09:58:26.0  )
31 నెలల గరిష్ఠానికి తయారీ పీఎంఐ!
X

న్యూఢిల్లీ: ఈ ఏడాది మే నెలలో తయారీ రంగ కార్యకలాపాలు 31 నెలల గరిష్ఠానికి చేరాయి. అధిక డిమాండ్, ఉత్పత్తే దానికి కారణమని ఎస్‌అండ్‌పీ గ్లోబల్‌ ఇండియా నెలవారీ నివేదికలో తెలిపింది. కొత్త ఆర్డర్‌లు గణనీయంగా పెరగడం కూడా తయారీ పీఎంఐ పుంజుకునేందుకు కారణమని పేర్కొంది. తయారీ కార్యకలాపాలను సూచించే పీఎంఐ సూచీ గత నెలలో 58.7 పాయింట్లుగా నమోదైంది. అంతకుముందు ఏప్రిల్‌లో ఇది 57.2 పాయింట్లుగా ఉంది. దాంతో వరుసగా 23వ నెలలోనూ తయారీ పీఎంఐ 50 పాయింట్ల ఎగువన నమోదైనట్టు ఎస్అండ్‌పీ గ్లోబల్ ఇండియా వెల్లడించింది. సాధారణంగా పీఎంఐ సూచీ 50 కంటే ఎక్కువ ఉంటే వృద్ధిగానూ, అంతకంటే తక్కువగా నమోదైతే క్షీణతగానూ పరిణిస్తారు.

గత 6 నెలల్లో కంపెనీలు అంతర్జాతీయ అమ్మకాల్లో వృద్ధిని చూడటతో మే నెలలో పుంజుకున్న ఆర్డర్‌లలో ఎగుమతులు కీలక పాత్ర పోషించాయి. మెరుగైన సఫరా, అనుకూల మార్కెట్ పరిస్థితుల కారణంగా దేశీయ తయారీ సంస్థలు ఉత్పత్తిని పెంచాయి. తయారీ రంగ కార్యకలాపాలు పెరగడం దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లలో భారత ఉత్పత్తులకు ఉన్న గిరాకీని సూచిస్తోందని ఎస్అండ్‌పీ గ్లోబల్ మార్కెట్ ఇంటిలిజెన్స్ ఎకనమిక్స్ అసోసియేట్ డైరెక్టర్ పొలియానా డి లిమా అన్నారు. దేశీయ ఆర్డర్ల పెరుగుదల ఆర్థికవ్యవస్థ వృద్ధికి దోహదపడుతుంది. అలాగే అంతర్జాతీయ వ్యాపారం గ్లోబల్ మార్కెట్లలో భాగస్వామ్యాన్ని ప్రోత్సహిస్తుందని, తద్వారా భారత్ సామర్థ్యాన్ని మరింత పెంచుతుందని పొలియానా పేర్కొన్నారు.

Also Read..

కోల్ ఇండియాలో 3 శాతం వాటా విక్రయించనున్న ప్రభుత్వం!

Advertisement

Next Story