2032 నాటికి రూ. 164 లక్షల కోట్లకు భారత రిటైల్ మార్కెట్!

by Harish |
2032 నాటికి రూ. 164 లక్షల కోట్లకు భారత రిటైల్ మార్కెట్!
X

న్యూఢిల్లీ: భారత రిటైల్ మార్కెట్ ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతోందని, 2032 నాటికి ఇది 2 ట్రిలియన్ డాలర్ల(సుమారు రూ. 164 లక్షల కోట్ల)కు చేరుకుంటుందని రిలయన్స్ రిటైల్ డైరెక్టర్ వి సుబ్రమణ్యం తెలిపారు. గత ఏడాది నాటికి భారత రిటైల్ మార్కెట్ సుమారు రూ. 69.15 లక్షల కోట్లుగా ఉంటుందని అంచనా. అందులో అసంఘటిత రిటైల్ మార్కెట్ వాటాయే 87 శాతం ఉంటుందని వి సుబ్రమణ్యం చెప్పారు.

సోమవారం పరిశ్రమల సంఘం ఫిక్కీ నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ, ప్రతి ఏటా పరిశ్రమ 10 శాతం వృద్ధి సాధిస్తున్న నేపథ్యంలో 2032 నాటికి రూ. 164 లక్షల కోట్లకు చేరుకుంటుంది. అసంఘటిత రిటైల్ మార్కెట్లో ఆధునిక మౌలిక సదుపాయాలు, టెక్నాలజీ వినియోగం మరింత పెరగాల్సిన అవసరం ఉంది. అందుకు స్థిరమైన వృద్ధికి మద్దతిచ్చే చర్యలు కావాలి. ప్రభుత్వ విధానాలతో పాటు దిగ్గజ వ్యాపార వ్యూహాల ద్వారా అసంఘటిత రిటైల్ మార్కెట్ పరిధిలోని చిన్న వ్యాపారుల వృద్ధికి తోడ్పాడు అందించాలని వి సుబ్రమణ్యం అభిప్రాయపడ్డారు.

స్కేలబుల్ వేర్‌హౌసింగ్, లాజిస్టిక్ ఎకోసిస్టమ్ ద్వారా ప్రధాన కేంద్రాలకు సరఫరా మౌలిక సదుపాయాల అభివృద్ధికి పెట్టుబడులు, ఏఐ, మెషిన్ లెర్నింగ్ వంటి అత్యాధునిక టెక్నాలజీ వినియోగం పెరగాల్సిన అవసరం ఉందని ఆయన తెలిపారు. రిటైల్ రంగంలో 5జీ టెక్నాలజీ వాడకం ద్వారా రానున్న రోజుల్లో పరిశ్రమ వృద్ధి మరింత వేగవంతంగా ఉంటుందని అంచనా వేస్తున్నట్టు వి సుబ్రమణ్యం పేర్కొన్నారు.

Advertisement

Next Story