Coal: డిమాండ్ మేరకు 6 శాతం పెరిగిన బొగ్గు దిగుమతులు

by Harish |
Coal: డిమాండ్ మేరకు 6 శాతం పెరిగిన బొగ్గు దిగుమతులు
X

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో భారతదేశ బొగ్గు దిగుమతులు 5.7 శాతం పెరిగి 75.26 మిలియన్ టన్నులకు చేరుకున్నాయి. ఇది గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో 71.16 మి.టన్నులుగా నమోదైంది. అదే దేశీయంగా ఉత్పత్తి చూసినట్లయితే 11.71 శాతం పెరిగింది. ఇది 2022-23లో 893.191 మి.టన్నులతో పోలిస్తే 2023-24లో 997.828 మి.టన్నులకు చేరుకుంది. నాన్ కోకింగ్, కోకింగ్ బొగ్గు దిగుమతులు స్వల్పంగా పెరిగాయి. ఏప్రిల్-జూన్ కాలంలో నాన్-కోకింగ్ బొగ్గు దిగుమతులు 49.12 మి.టన్నుల వద్ద ఉన్నాయి, గత సంవత్సరం ఇదే కాలంలో దిగుమతి అయిన 46.53 మి.టన్నుల కంటే ఎక్కువ. అలాగే, కోకింగ్ బొగ్గు దిగుమతులు ఏప్రిల్-జూన్ 2024లో 15.45 మి.టన్నులుగా నమోదయ్యాయి, గత ఏడాది ఇదే కాలంలో నమోదైన 15.20 మి.టన్నులతో పోలిస్తే స్వల్పంగా పెరిగింది.

టాటా స్టీల్, సెయిల్ మధ్య జాయింట్ వెంచర్ నుండి బీ టూ బీ ఈ-కామర్స్ ప్లాట్‌ఫారమ్ ఎమ్జంక్షన్ సర్వీసెస్ లిమిటెడ్ డేటా ప్రకారం, జూన్‌ నెలలో బొగ్గు దిగుమతులు 6.59 శాతం పెరిగి 22.97 మి.టన్నులకు చేరుకోగా ఇది మునుపటి ఆర్థిక సంవత్సరం ఇదే నెలలో 21.55 మి.టన్నుల వద్ద ఉంది. వర్షాకాలంలో పారిశ్రామిక కార్యకలాపాలు మందగించడం వల్ల వచ్చే నెలలో దిగుమతుల డిమాండ్ తగ్గే అవకాశం ఉందని ఎమ్జంక్షన్ సర్వీసెస్ లిమిటెడ్ ఎండీ, సీఈఓ వినయ వర్మ తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed