అక్టోబర్ 1 నుంచి అటల్ పెన్షన్ యోజనకు పన్ను చెల్లింపుదారులు అనర్హులు!

by Harish |
అక్టోబర్ 1 నుంచి అటల్ పెన్షన్ యోజనకు పన్ను చెల్లింపుదారులు అనర్హులు!
X

న్యూఢిల్లీ: అటల్ పెన్షన్ యోజన(ఏపీవై) పథకానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆదాయ పన్ను చెల్లింపుదారులు ఈ ఏడాది అక్టోబర్ 1వ తేదీ నుంచి పథకం ప్రయోజనాలు పొందడానికి అనర్హులని ఓ ప్రకటనలో వెల్లడించింది. ఆర్థిక మంత్రిత్వ శాఖ గురువారం విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం, అక్టోబర్ నుంచి ఆదాయపు పన్ను చెల్లింపుదారులు ఈ పథకానికి అనర్హులుగా మారతారు. కానీ, నిర్దేశించిన తేదీకి ముందు ఈ పథకం ఎంచుకున్న వారికి ఈ నిబంధన వర్తించదని, ఆ తేదీ తర్వాత పథకాన్ని తీసుకుంటే వెంటనే సంబంధిత ఖాతాను మూసేయనున్నట్టు మంత్రిత్వ శాఖ తెలిపింది. అదే సమయంలో అప్పటివరకు వారు జమ చేసిన మొత్తాన్ని తిరిగి చెల్లించనున్నట్టు పేర్కొంది.

అక్టోబర్‌కి ముందు ఏపీవై పథకంలో చేరిన ఆదాయ పన్ను చెల్లింపుదారులు ఆ తర్వాత కూడా కొనసాగుతారు. అటల్ పెన్షన్ యోజన పథకం 2015లో ప్రారంభించబడింది, ఇది అసంఘటిత రంగంలోని 18-40 సంవత్సరాల వయస్సు గల వారికి సామాజిక భద్రతను అందిస్తుంది. నెలకు రూ. 100 నుంచి జమ చేసుకోవచ్చు. పథకాన్ని ఎంచుకున్న వారు జమ చేసిన మొత్తాన్ని బట్టి 60 ఏళ్ల వయస్సు వచ్చిన తర్వాత నెలకు రూ. 1,000 నుంచి రూ. 5,000 వరకు గ్యారెంటీ పెన్షన్‌ను పొందుతారు. ఈ ఏడాది మార్చి నాటికి ఏపీవై పథకంలో మొత్తం 4 కోట్లకు పైగా సబ్‌స్క్రైబర్లు ఉన్నారు.



Next Story