భారత్, సింగపూర్ మధ్య యూపీఐ చెల్లింపులు ప్రారంభం!

by Hamsa |
భారత్, సింగపూర్ మధ్య యూపీఐ చెల్లింపులు ప్రారంభం!
X

న్యూఢిల్లీ: భారత డిజిటల్ చెల్లింపుల రంగంలో మరో కీలక పరిణామం చోటుచెసుకుంది. ఇప్పటికే భారత్ వెలుపలకు చేరిన దేశ యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్(యూపీఐ) వ్యవస్థ మరింత విస్తరించింది. భారత్-సింగపూర్ మధ్య క్రాస్-బోర్డర్ చెల్లింపు కనెక్టివిటీ మంగళవారం ప్రారంభమైంది. ఈ మేరకు భారత ప్రధాని నరేంద్ర మోదీ, సింగపూర్ ప్రధాన మంత్రి లీ సీన్ లూంగ్ ఈ ఒప్పందంపై సంతకాలు చేశారు.

దీంతో ఇరు దేశాల మధ్య డిజిటల్ చెల్లింపులు మరింత సులభతరం కానున్నాయి. సింగపూర్‌లో ఉన్న భారతీయులు ఇకమీదట దేశీయంగా ఉన్న తమ ఆత్మీయులకు నగదును యూపీఐ ద్వారా పంపవచ్చు. దీనికోసం యూపీఐ, సింగపూర్‌లోని పే-నౌ కనెక్ట్ చేయబడ్డాయి. ఈ ప్రక్రియను భారత్ నుంచి ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్, సింగపూర్ నుంచి మానిటరీ అథారిటీ ఆఫ్ సింగపూర్ మేనేజింగ్ డైరెక్టర్ రవి మీనన్ మొదలుపెట్టారు.

దీంతో స్మార్ట్‌ఫోన్ వినియోగించే ప్రతి ఒక్కరు యూపీఐ సేవలను వినియోగించవచ్చు. బ్యాంకులతో సంబంధం లేకుండా ఆర్థిక లావాదేవీలను సులభంగా, తక్కువ సమయంలో పూర్తి చేసే అవకాశం ప్రజలకు లభిస్తుంది. ఈ సందర్భంగా వర్చువల్‌గా ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రధాని మోదీ భారత్‌లో డిజిటల్ లావాదేవీలు త్వరలో నగదు లావాదేవీలను అధిగమిస్తాయన్నారు.

ప్రస్తుతం దేశంలో చాలామంది యూపీఐ విధానాన్ని వాడుతున్నారు. 2022లో దేశీయంగా రూ. 126 లక్షల కోట్ల విలువైన 7,400 కోట్ల డిజిటల్ లావాదేవీలు జరిగాయి. ఇది యూపీఐ వ్యవస్థ ఎంత సురక్షితమైనదో సూచిస్తుందని మోదీ అభిప్రాయపడ్డారు. ఇప్పుడు యూపీఐ-పేన్ నౌ ద్వారా భారత్, సింగపూర్ దేశాల ప్రజలు సులభరీతిలో నగదు చెల్లింపులు జరుపుకోవచ్చని తెలిపారు. ముఖ్యంగా సింగపూర్‌లో ఉన్న భారత విద్యార్థులు, వలస కార్మికులు తక్కువ ఖర్చుతో చెల్లింపులు చేయవచ్చన్నారు.

Advertisement

Next Story