త్వరలో పూర్తికానున్న IDBI బ్యాంకు ప్రైవేటీకరణ!

by Harish |   ( Updated:2023-01-10 12:25:45.0  )
త్వరలో పూర్తికానున్న IDBI బ్యాంకు ప్రైవేటీకరణ!
X

న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోగా ఐడీబీఐ బ్యాంక్ ప్రైవేటీకరణ ప్రక్రియ పూర్తవుతుందని పెట్టుబడులు, ప్రభుత్వ ఆస్తుల నిర్వహణ విభాగం(దీపమ్‌) సెక్రటరీ తుహిన్ కాంత పాండె సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. గతవారమే ఐడీబీఐ బ్యంకులో సుమారు 61 శాతం వాటాను కొనేందుకు ఆసక్తి కలిగిన వారి నుంచి ప్రాథమిక బిడ్లు దాఖలయ్యాయని ఆయన ట్విట్టర్ ద్వారా చెప్పారు.

ఇవి ఆమోదం పొందిన తర్వాత ఆయా సంస్థలు ఆర్థిక బిడ్లను సమర్పించాల్సి ఉంటుంది. అనంతరం రిజర్వ్ ధరలపై నిర్ణయం ఉంటుందన్నారు. బ్యాంక్ వాటా కోసం ప్రాథమిక బిడ్లు వేసిన వారి పేర్లు, బిడ్ల సంఖ్యపై ఆయన స్పష్టత ఇవ్వనప్పటికీ ఈ ప్రక్రియలో తదుపరి దశ కొనసాగుతుందని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ఐడీబీఐ బ్యాంకులో ప్రభుత్వం తన వాటా నుంచి 30.48 శాతం, అలాగే ప్రభుత్వ రంగ ఎల్‌ఐసీ సైతం తనకున్న వాటాలో 30.24 శాతాన్ని అమ్మేందుకు సిద్ధమైంది. దీంతో ఐడీబీఐ బ్యాంకులో మొత్తం 60.72 శాతం వాటా విక్రయం కానుంది.

బిడ్లను దాఖలు చేసేందుకు కనీస నికర విలువ రూ. 22,500 కోట్లను కలిగిన కంపెనీలు చేయవచ్చునని, అంతేకాకుండా గడిచిన ఐదేళ్లలో కనీసం మూడేళ్ల పాటు లాభాలను నమోదు చేసి ఉండాలని గతంలో దీపమ్ స్పష్టం చేసింది. బ్యాంకును కొనుగోలు చేయబోయే సంస్థ కనీసం అయిదేళ్ల వరకు 40 శాతం వాటాను తమ వద్దే ఉంచుకోవాల్సి ఉంటుంది.

ఇవి కూడా చదవండి : IDBI బ్యాంక్‌లో వాటాల ఉపసంహరణ కోసం అనేక బిడ్‌లు: DIPAM సెక్రటరీ

Advertisement

Next Story

Most Viewed