Hindenburg: భారత స్టాక్‌ మార్కెట్లపై మరో బాంబ్ పేల్చడానికి సిద్ధమైన హిండెన్‌బర్గ్..!

by Harish |
Hindenburg: భారత స్టాక్‌ మార్కెట్లపై మరో బాంబ్ పేల్చడానికి సిద్ధమైన హిండెన్‌బర్గ్..!
X

దిశ, బిజినెస్ బ్యూరో: గత ఏడాది అదానీ గ్రూప్ కంపెనీలపై సంచలన నివేదికను బయటపెట్టిన అమెరికాకు చెందిన షార్ట్‌ సెల్లర్‌ హిండెన్‌బర్గ్‌ రీసెర్చ్ మరోసారి భారత మార్కెట్లపై బాంబ్ పేల్చడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది. తాజాగా ఈ సంస్థ సోషల్ మీడియా ఎక్స్‌లో ఒక పోస్ట్‌ చేసింది. దానిలో "సమ్ థింగ్ బిగ్ సూన్ ఇండియా" అని పేర్కొంది. దీనర్థం ఇండియాలో మరో కంపెనీకి సంబంధించిన సంచలన నివేదికను వెల్లడించే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.

గత ఏడాది హిండెన్‌బర్గ్ అదానీ గ్రూప్‌‌కు సంబంధించి ఒక నివేదికను విడుదల చేసింది. దీనిలో అదానీ గ్రూపు తన కంపెనీల షేర్లను కృత్రిమంగా పెంచడానికి ఇన్‌సైడర్ ట్రేడింగ్‌కు పాల్పడిందని ఆరోపణలు చేసింది. దీంతో రికార్డు గరిష్టాలను తాకిన అదానీ షేర్లు ఒక్కసారిగా కుప్పకూలాయి. దీని వలన $100 బిలియన్లకు పైగా నష్టాలు సంభవించాయి. అలాగే, ఈ నివేదిక ఎఫెక్ట్‌తో భారత స్టాక్‌మార్కెట్ల సూచీలు కూడా భారీగా పడిపోయాయి. అదానీ గ్రూప్ హిండెన్‌బర్గ్ నివేదికలో చేసిన అన్ని ఆరోపణలను ఖండించింది. జూన్‌లో జరిగిన అదానీ ఎంటర్‌ప్రైజెస్ వార్షిక సర్వసభ్య సమావేశంలో ఆరోపణలను ప్రస్తావిస్తూ, గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ మాట్లాడుతూ, మా సమగ్రత, ప్రతిష్టపై దాడి చేయడానికి ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు, వాటిని ఎదుర్కొని తిరిగి పోరాడుతామని, మా గ్రూప్ పునాదులను బలహీనపరచలేరని అన్నారు.

ప్రస్తుతం అదానీ షేర్లు క్రమంగా పుంజుకున్నాయి. క్రమంగా అవి రికార్డు గరిష్టాలకు చేరాయి. స్టాక్‌మార్కెట్లు సైతం రికార్డు పాయింట్లకు చేరాయి. ఇలాంటి సమయంలో హిండెన్‌బర్గ్ మరోసారి ఇంకొ భారత కంపెనీపై దాడి చేయడానికి సిద్ధమవడం తీవ్ర చర్చకు దారితీసింది. ఇదిలా ఉంటే హిండెన్‌బర్గ్ పోస్ట్‌పై కొంతమంంది నిపుణులు మాట్లాడుతూ, ఆ సంస్థ కావాలనే భారతదేశ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీయాలనే ఉద్దేశంతోనే ఇలా కుట్రపూరిత ఆరోపణలు చేస్తోందని అంటున్నారు.

Advertisement

Next Story

Most Viewed