SEBI: సెబీ, ఎన్ఎస్ఈ, బీఎస్ఈలకు రూ. 80 లక్షల జరిమానా విధించిన బాంబే హైకోర్టు

by S Gopi |
SEBI: సెబీ, ఎన్ఎస్ఈ, బీఎస్ఈలకు రూ. 80 లక్షల జరిమానా విధించిన బాంబే హైకోర్టు
X

దిశ, బిజినెస్ బ్యూరో: స్టాక్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీతో పాటు బీఎస్ఈ, ఎన్ఎస్ఈలపై బాంబే హైకోర్టు జరిమానా విధిస్తూ నిర్ణయం తీసుకుంది. ముంబైకు చెందిన ఓ వ్యక్తి డీమ్యాట్ ఖాతాను చట్టవిరుద్ధంగా స్తంభింపజేయడమే కాకుండా అతని కుమారుడిని ప్రమోటర్‌గా తప్పుగా చూపినందుకు మూడు సంస్థలపై రూ. 80 లక్షల జరిమానా విధించింది. అయితే, మార్కెట్ నియంత్రణ సంస్థపై కోర్టు లేదా ట్రిబ్యునల్ జరిమానా విధించడం చాలా అరుదైన సందర్భం. ఈ కేసు 2017 నాటి సెబీ ఆర్డర్‌కు సంబంధించినది. ప్రదీప్ మెహతా, అతని కుమారుడు నీల్ మెహతా డీమ్యాట్ ఖాతాలను సెబీ, బీఎస్ఈ, ఎన్ఎస్ఈ స్తంభింపజేశాయి. నీల్ మెహతా మామయ్య చీఫ్ ప్రమోటర్‌గా ఉన్న శ్రేనుజ్ అండ్ కంపెనీ సెబీ నిబంధనల ఉల్లంఘించినట్టుగా పేర్కొంటూ వారి డీమ్యాట్ ఖాతాను ఫ్రీజ్ చేశారు. దీనిపై వారిద్దరూ బాంబే హైకోర్టులో పిటిషన్ వేస్తూ, కంపెనీ పనితీరులో ఎలాంటి సహకారం, సలహాదారు హోదాను కూడా ఎప్పుడూ పొందలేదని పేర్కొన్నారు. దీనిపై కోర్టు స్పందిస్తూ సెబీ ఆదేశాలు చట్టవిరుద్ధంగా ఉన్నాయని, ఆర్డర్ చెల్లదని స్పష్టం చేసింది. ప్రదీప్ మెహతా, అతని కుమారుడి డీమ్యాట్ ఖాతాలు సజావుగా పనిచేసేందుకు అనుమతించింది. అలాగే, నీల్ మెహతాకు రూ. 50 లక్షలు, అతని తండ్రికి రూ. 30 లక్షలు రెండు వారాల్లోగా చెల్లించాలని ఆదేశించింది.

Advertisement

Next Story