చిప్‌ల తయారీ కోసం రూ. 1.75 లక్షల కోట్ల విలువైన ప్రతిపాదనలు

by S Gopi |
చిప్‌ల తయారీ కోసం రూ. 1.75 లక్షల కోట్ల విలువైన ప్రతిపాదనలు
X

దిశ, బిజినెస్ బ్యూరో: భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న సెమీకండక్టర్ల తయారీ కోసం పెద్ద ఎత్తున పెట్టుబడి ప్రతిపాదనలు వచ్చినట్టు తెలుస్తోంది. గత కొంతకాలంగా ప్రభుత్వం కంపెనీలు, జేవీల నుంచి సుమారు 21 బిలియన్ డాలర్ల(మన కరెన్సీలో రూ. 1.75 లక్షల కోట్ల) విలువైన సెమీకండక్టర్ పెట్టుబడి ప్రతిపాదనలను అందుకున్నట్టు సమాచారం. ఇందులో విదేశీ చిప్ తయారీ కంపెనీలతో పాటు స్థానిక సంస్థలు, పలు కంపెనీలు కలిసి ఏర్పడిన జాయింట్ వెంచర్(జేవీ) సంస్థలున్నాయి. ఇటీవలే ఇజ్రాయెల్‌కు చెందిన టవర్ సెమీకండక్టర్ లిమిటెడ్ 9 బిలియన్ డాలర్ల(రూ. 75 వేల కోట్లు) విలువైన ప్లాంట్ ఏర్పాటుకు ఆసక్తి గా ఉన్నట్టు ప్రకటించింది. అలాగే, దేశీయ దిగ్గజం టాటా గ్రూప్ సైతం రూ. 66 వేల కోట్లకు పైగా విలువైన చిప్ ఫ్యాబ్రికేషన్ యూనిట్ ఏర్పాటుకు ముందుకొచ్చింది. ఈ రెండు ప్రాజెక్టులు దేశ ప్రధాని నరేంద్ర మోడీ సొంత రాష్ట్రం గుజరాత్‌లో ఉండనున్నాయి.

గత కొన్నాళ్ల నుంచి సెమీకండక్టర్ల కొరత వల్ల దేశీయ చిప్ సామర్థ్యాలను అభివృద్ధి చేసేందుకు యూఎస్, జపాన్, చైనా దేశాలు భారీ పెట్టుబడులకు సిద్ధమవుతున్నాయి. దీనివల్ల ప్రపంచవ్యాప్తంగా భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు కూడా నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అవకాశాన్ని దక్కించుకునేందుకు, భారత్‌ను గ్లోబల్ తయారీ హబ్‌గా మార్చాలనే లక్ష్యంతో అంతర్జాతీయ చిప్ తయారీ కంపెనీలకు పెట్టుబడుల కోసం ఆహ్వానం పంపింది. దిగుమతుల భారం తగ్గించి, పెరుగుతున్న స్మార్ట్‌ఫోన్ పరిశ్రమను మెరుగుపరిచేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

ఇప్పటికే పలు దిగ్గజ సంస్థలు చిప్ తయారీలో పెట్టుబడులను, ఇతర ప్రకటనలు చేశాయి. ప్రభుత్వ చొరవతో ఐఫోన్ తయారీ కంపెనీ యాపిల్ సైతం దేశీయంగా తయారీ, ఎగుమతులను పెంచింది. మరోవైపు గూగుల్ దేశీయంగానే స్మార్ట్‌ఫోన్ అసెంబుల్ కార్యకలాపాల కోసం సిద్ధమవుతోంది. అమెరికాకు చెందిన మెమొరీ మేకర్ టెక్నాలజీ గుజరాత్‌లో చిప్ తయారీపై దృష్టి సారించింది. ఇక, జపాన్‌కు చెందిన రెనెసాస్ ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్, మురుగప్ప గ్రూప్‌నకు చెందిన సీజీ పవర్ అండ్ ఇండస్ట్రియల్ సొల్యూషన్స్ చిప్-ప్యాకేజింగ్ కోసం వెంచర్‌ను ఏర్పాటు చేయాలని చూస్తోంది.

Advertisement

Next Story