మొబైల్‌ఫోన్ విడిభాగాలపై దిగుమతి సుంకం తగ్గించిన కేంద్రం

by S Gopi |
మొబైల్‌ఫోన్ విడిభాగాలపై దిగుమతి సుంకం తగ్గించిన కేంద్రం
X

దిశ, బిజినెస్ బ్యూరో: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మధ్యంతర బడ్జెట్‌ను సమర్పించడానికి ఒకరోజు ముందు కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. మొబైల్‌ఫోన్ విడిభాగాలపై దిగుమతి సుంకాలను 15 శాతం నుంచి 10 శాతానికి తగ్గిస్తున్నట్టు ప్రకటించింది. తగ్గించిన దిగుమతి సుంకం బ్యాటరీ కవర్లు, మెయిల్ లెన్స్‌లు, బ్యాక్ కవర్లు, ప్లాస్టిక్, మెటల్‌తో రూపొందించిన మెకానికల్ వస్తువుల వంటి విడిభాగాలకు వర్తిస్తుందని మంగళవారం ప్రభుత్వం విడుదల చేసిన నోటిఫికేషన్‌లో పేర్కొంది. ప్రస్తుతం 15-18 శాతం విడిభాగాలు మాత్రమే స్థానికంగా లభిస్తున్నాయని కౌంటర్‌పాయింట్ రీసెర్చ్ డైరెక్టర్ తరుణ్ పాఠక్ చెప్పారు. దేశీయంగా అసెంబ్లింగ్ కోసం మెజారిటీ విడిభాగాలు దిగుమతి అవుతున్న కారణంగా దిగుమతి సుంకాన్ని తగ్గిస్తే మొబైల్‌ఫోన్ తయారీ కంపెనీలు తక్కువ ధరలో విడిభాగాలను పొందే అవకాశం ఉంది. తద్వారా దేశంలో స్మార్ట్‌ఫోన్ ధరలు మరింత తక్కువ ధరకు లభించనున్నాయని తరుణ్ పాఠక్ అభిప్రాయపడ్డారు. 2021 తర్వాత నుండి భారత స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో సగటున అమ్మకాల ధర ఏడాదికి 15-20 శాతం పెరుగుతున్నాయి. దీంతో డిమాండ్‌పై ప్రభావం పడి స్మార్ట్‌ఫోన్ అమ్మకాలు నెమ్మదించాయి. ఇలాంటి సమయంలో ప్రభుత్వం దిగుమతి సుంకాలను తగ్గించడం సంతోషంగా ఉంది. దీనివల్ల స్మార్ట్‌ఫోన్ పరిశ్రమ డిమాండ్‌ను పెంచడంతో పాటు ఒరిజినల్ పరికరాల తయారీదారులకు ప్రయోజనం కలిగిస్తుందని తరుణ్ పాఠన్ వివరించారు. విడిభాగాలపై దిగుమతి సుంకాలు తగ్గించాలని పరిశ్రమ నుంచి చాలా కాలంగానే ప్రభుత్వాన్ని కోరుతోంది. ఇన్నళ్లకు ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకున్నప్పటికీ, స్మార్ట్‌ఫోన్ తయారీ కంపెనీలు వచ్చే ప్రయోజనాలను వినియోగదారులకు కూడా అందిస్తాయా లేదా అనేది చూడాల్సి ఉంది.

Advertisement

Next Story

Most Viewed