Gold Price : ఆల్ టైం రికార్డ్ సృష్టించిన బంగారం ధరలు

by M.Rajitha |   ( Updated:2024-10-18 13:26:29.0  )
Gold Price : ఆల్ టైం రికార్డ్ సృష్టించిన బంగారం ధరలు
X

దిశ, వెబ్ డెస్క్ /బిజినెస్ బ్యూరో: బంగారం ధరలు కొత్త రికార్డులను తిరగరాస్తోంది. దేశవ్యాప్తంగా పండుగ సీజన్ కావడంతో ప్రజల నుంచి డిమాండ్ పెరగడం, ఆభారణాల తయారీ కోసం వ్యాపారుల నుంచి గిరాకీ ఊపందుకోవడంతో పసిడి ధరలు శుక్రవారం రూ. 80,000 మార్కును చేరుకున్నాయి. వరుసగా మూడు రోజులుగా పెరుగుతున్న బంగారం ధరలు శుక్రవారం 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం రూ. 870 పెరిగి రూ. 78,980కు పెరిగింది. వివిధ రకాల పన్నులు కలుపుకుని స్థానిక రిటైల్ దుకాణాల్లో రూ. 80 వేలకు చేరుకుంది. ఆభరణాల తయారీలో వాడే 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం రూ. 800 పెరిగి రూ. 72,400గా ఉంది. పన్నులు కలుపుకుని ఇది రూ. 74 వేల వరకు చేరుకోవచ్చు. వెండి కూడా కిలోకు రూ. 1,000 పెరిగి రూ. 1,05,000కి పెరిగింది. ఫ్యూచర్ ట్రేడ్‌లో డిసెంబర్ డెలివరీకి సంబంధించి గోల్డ్ కాంట్రాక్ట్‌లు ఎంసీఎక్‌లో 10 గ్రాములు రూ. 77,620 వద్ద ట్రేడవుతున్నాయి. పండుగ సీజన్ ప్రజల నుంచి కొనుగోళ్లు పుంజుకోవడం, మార్కెట్లో లోహాలకు డిమాండ్ రికార్డు స్థాయిలో పెరిగిందని పరిశ్రమ నిపుణులు తెలిపారు. మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న ఉద్రిక్తత, అమెరికా అధ్యక్ష ఎన్నికల కారణంగా ఏర్పడిన అనిశ్చితి మధ్య పెట్టుబడిదారులు సురక్షితమైన పెట్టుబడులకు ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed