Kavitha: నేను చెప్పింది అబద్దమని నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా.. కాంగ్రెస్, బీజేపీలకు కవిత చాలెంజ్

by Prasad Jukanti |   ( Updated:2025-01-03 08:31:41.0  )
Kavitha: నేను చెప్పింది అబద్దమని నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా.. కాంగ్రెస్, బీజేపీలకు కవిత చాలెంజ్
X

దిశ, డైనమిక్ బ్యూరో : కాంగ్రెస్ (Congress), బీజేపీ (BJP) అడుగడుగునా బీసీలకు అన్యాయం చేశాయని, ఈ రెండు జాతీయ పార్టీలు బీసీలకు చేసిన ద్రోహంపై తాను చెప్పిన విషయాల్లో ఏ ఒక్కటి అవాస్తవం అని తేల్చినా శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటానని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత (Kavitha) చాలెంజ్ చేశారు. దేశంలో బీసీలకు ఎవరైనా న్యాయం చేశారా అంటే ఇది కేవలం ప్రాంతీయ పార్టీలు మాత్రమేనన్నారు. ఇవాళ ఇందిరాపార్క్‌లో నిర్వహించిన బీసీ మహాసభలో (Indira Park BC Maha Sabha) కవిత మాట్లాడుతూ.. రాబోయే జనాభా గణనలో కులగణన చేయాలని బీజేపీని డిమాండ్ చేస్తున్నానన్నారు. 42 శాతం రిజర్వేషన్లు ఇచ్చిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలకు పోతామని కాంగ్రెస్ హామీ ఇచ్చిందని, కర్ణాటక, బిహార్, మహారాష్ట్ర ఫెయిల్యూర్ స్టోరీ తెలియకుండానే హామీ ఇచ్చారా అని ప్రశ్నించారు. బీసీల లెక్కలపై ఒక కమిషన్ వేస్తే మరో కమిషన్ రిపోర్టు ఇస్తున్నదని, ఇది రేపు కోర్టుల్లో నిలుస్తుందా అని అన్నారు. ఈ కుట్రపై కాంగ్రెస్ జవాబు చెప్పాల్సిందేనని పేర్కొన్నారు.

2011 కులగణన నివేదిక ఏమైంది?

నెహ్రూ ఏర్పాటు చేసిన కమిషన్ రిపోర్టును నెహ్రూనే తిరస్కరించడం ఇది కాంగ్రెస్ పార్టీ బీసీలకు చేసిన ద్రోహం కాదా అని కవిత ప్రశ్నించారు. 1955 లో నెహ్రూ ఆ నివేదికను తిరస్కరిస్తే ఆ తర్వాత 25 ఏళ్లు ఎవరూ బీసీల గురించి పట్టించుకోలేదన్నారు. పదేళ్లు బీసీలు గుర్తుకురాలేదా అని తమను బీసీలు ప్రశ్నించేవారికి కాంగ్రెస్ చరిత్ర అంతా చెప్తామన్నారు. నెహ్రూ, ఇందిరమ్మ రాజ్యంలో బీసీలకు అన్యాయమే చేశారన్నారు. సోనియమ్మ రాజ్యంలో 2011లో రూ. 4500 కోట్లు వెచ్చించి కులగణన చేసి, ఇప్పటివరకు ఆ నివేదిక బయట పెట్టలేదన్నారు. బీజేపీ కూడా ఆ రిపోర్టును బయటపెట్టకపోగా కులగణనకు వ్యతిరేకం అని బహిరంగంగానే చెబుతున్నదని విమర్శించారు.

దేశంలో కులం ఉంది..

సావిత్రిబాయి ఫూలే (Savitribai Phule) జన్మదినం దేశంలో ఉన్న మహిళలందరికీ పండగ రోజు కవిత అన్నారు. ఈరోజు మహిళలంతా చదువుకుంటున్నారంటే అది ఆమె కృషి అని తెలిపారు. చాలామంది దేశంలో కులం లేదని చెబుతున్నారని, కానీ కులం ఉన్నది నిజం కాబట్టే రాజ్యాంగంలో ఎస్సీ, ఎస్టీలకు కులాలకు రక్షణ కల్పించారన్నారు. అయితే బీసీలకు రాజ్యాంగంలో రక్షణ దొరికి ఉంటే ఇవాళ దేశం అభివృద్ధిలో అమెరికాను దాటేసేదన్నారు.

Advertisement

Next Story