Gold: రూ. 90 వేలకు చేరుకుంటున్న బంగారం.. తగ్గని ధరలు

by S Gopi |
Gold: రూ. 90 వేలకు చేరుకుంటున్న బంగారం.. తగ్గని ధరలు
X

దిశ, బిజినెస్ బ్యూరో: బంగారం ధరలు రోజురోజుకు కొత్త రికార్డు స్థాయిలకు చేరుకుంటున్నాయి. కొన్ని వారాల క్రితం కొంత కష్టపడి దాచుకుని కొనే స్టేజ్‌లో ఉన్న పసిడి ధరలు ఇప్పుడు సామాన్యుడికి ఆల్ట్రా లగ్జరీగా మారిపోయింది. అంతర్జాతీయ పరిణామాలు, పరిస్థితుల కారణంగా క్రమంగా పది గ్రాముల బంగారం రూ. 90 వేలకు చేరువవుతోంది. ఈ ఏడాది ప్రారంభంలో రూ. 80 వేలుగా ఉంది. సోమవారం నాటికి హైదరాబాద్ మార్కెట్లో 24 క్యారెట్ల స్వచ్ఛమైన పది గ్రాముల బంగారం రూ. 390 పెరిగి రూ. 87,060కి చేరుకుంది. పరిస్థితులు ఇలాగే కొనసాగితే ధరలు రూ. 90 వేలకు చేరుకోవడం ఖాయమని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. ఆభరణాల తయారీలో వాడే 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం రూ. 350 పెరిగి రూ. 79,800కి పెరిగింది. వెండి రూ. 1,07,000 వద్ద స్థిరంగా ఉంది. ప్రపంచవ్యాప్తంగా వివిధ సెంట్రల్ బ్యాంకుల కొనుగోళ్లతో పాటు పెట్టుబడులకు డిమాండ్ పెరగడంతో బంగారం ఊపందుకుంటోందని నిపుణులు తెలిపారు. 2025లో ధరలు పెరిగేందుకు ప్రధానంగా ఇటీవల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సుంకాలి పెంచుతామని హెచ్చరించడం కారణంగా ఉంది. ఫలితంగా పెట్టుబడిదారులు ఈక్విటీల నుంచి సురక్షితమైన పెట్టుబడి సాధనంగా బంగారంలో పెట్టుబడులను మళ్లిస్తున్నారు. అంతర్జాతీయంగా వాణిజ్య యుద్ధాలు, ఫెడ్ వడ్డీ రేట్ల చుట్టూ అనిశ్చితి నెలకొంది. ఇవన్నీ ప్రపంచవ్యాప్తంగా ఉన్న పెట్టుబడిదారులను భయాందోళనకు గురి చేస్తున్నాయి. దాంతో బంగారం సురక్షితమని ఎక్కువమంది భావిస్తున్నారు. అంతర్జాతీయ మార్కెట్లలోను బంగారం ఈ ఏడాది ప్రారంభం నుంచి 11 శాతం పెరిగి ఔన్సుకు 2,906 డాలర్లను అధిగమించింది.

Next Story