పోస్ట్ ఆఫీస్ పథకాల గురించి పూర్తి వివరాలు..!

by Harish |   ( Updated:2023-01-28 10:01:36.0  )
పోస్ట్ ఆఫీస్ పథకాల గురించి పూర్తి వివరాలు..!
X

హైదరాబాద్: బ్యాంకుల వద్ద లభించే ఎఫ్‌డీ పథకాలు కాకుండా, దీర్ఘకాలానికి మరింత మెరుగైన వడ్డీతో రాబడి పొందాలంటే పోస్ట్ ఆఫీస్ అందించే పథకాలను ఎంచుకోవడం ఉత్తమమైన మార్గం. ఎక్కువ కాలానికి సొమ్మును దాచుకోవాలని భావించే వారు పోస్ట్ ఆఫీస్ అందించే పథకాల గురించి తెలుసుకోవాలి. అవేంటో చూద్దాం..

సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్(ఎస్‌సీఎస్ఎస్)..

ప్రభుత్వం హామీతో పదవీ విరమణ ప్రయోజనాలను అందించే పథకాల్లో సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్(ఎస్‌సీఎస్ఎస్) ఒకటి. 60 ఏళ్లు దాటిన వారు, స్వచ్ఛంద పదవీ విరమణ పొందిన 55-60 ఏళ్ల వారు దీనికి అర్హులు. అలాగే, దేశ రక్షణలో పనిచేసి 50-60 ఏళ్లలో పదవీ విరమణ పొందినవారు ఈ పథకాన్ని ఎంచుకోవచ్చు. ఇందులో రూ. 1,000 నుంచి రూ. 15 లక్షల వరకు ఎంత మొత్తమైనా ఒకేసారి పెట్టుబడిగా పెట్టేందుకు అవకాశం ఉంటుంది. ఈ పథకంపై వడ్డీ ఏడాదికి 8 శాతంతో ఇస్తారు. దీనికి ఐదేళ్ల కాలపరిమితి ఉంటుంది. ఒక ఆర్థిక సంవత్సరంలో నాలుగు దఫాల్లో వడ్డీ అకౌంట్‌లో జమ అవుతుంది. ఈ పథకంలో పెట్టుబడి పెట్టిన వారికి పన్ను మినహాయింపు కూడా లభిస్తుంది.

పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్(పీపీఎఫ్)..

సుధీర్ఘ కాలవ్యవధితో వచ్చే పీపీఎఫ్ పథకం ఎవరైనా తెరవొచ్చు. 15 ఏళ్ల సుదీర్ఘ కాల వ్యవధి కలిగిన ఈ పథకంలో కనీస పెట్టుబడి ఏడాదికి రూ. 500 ఉండగా, గరిష్ఠంగా రూ. 1.50 లక్షలుగా ఉంది. ఈ పథకంపై ఏడాదికి 7.10 శాతం వడ్డీ అమలవుతుంది. ఈ పథకంలో పెట్టుబడిని ఎంచుకుంటే మెచ్యూరిటీ కంటే ముందుగా పెట్టుబడులను పూర్తిగా తీసుకోవడానికి ఉండదు. కానీ, పథకం ప్రారంభించిన నాటి నుంచి ఏడవ సంవత్సరంలో కొంత మొత్తం విత్‌డ్రా చేసుకోవచ్చు. అలాగే, 3-6 ఏళ్ల మధ్య రుణం పొందే అవకాశం ఉంటుంది. పీపీఎఫ్ పథకం ఎంచుకున్న వారికి ఆదాయపు పన్ను చట్టం సెక్షన్ 80సీ కింద పన్ను మినహాయింపు ఉంటుంది. అలాగే, పెట్టుబడిపై వచ్చే వడ్డీ, మెచ్యూరిటీ మొత్తమపి పన్ను ఉండదు.

సుకన్య సమృద్ధి యోజన(ఎస్ఎస్‌వై)..

ఆడబిడ్డల భవిష్యత్తు కోసం ప్రత్యేకంగా తీసుకొచ్చినదే సుకన్య సమృద్ధి యోజన పథకం. 10 ఏళ్ల కంటే తక్కువ వయసున్న అమ్మాయిల పేర ఈ పథకాన్ని ప్రారంభించవచ్చు. ఈ పథకంపై ఏడాదికి అత్యధికంగా 7.60 శాతం వడ్డీ లభిస్తుంది. ఈ పథకంలో పెట్టుబడులను ఏడాదికి కనిష్టం రూ. 250 నుంచి గరిష్ఠంగా రూ. 1.50 లక్షల వరకు దాచుకోవచ్చు. ఈ పథకం కాలపరిమితి 15 ఏళ్లు ఉంటుంది. అంటే 15 ఏళ్లు పెట్టుబడి పెట్టిన మరో 6 ఏళ్లు సొమ్ము కట్టాల్సిన అవసరం లేదు. ఆడబిడ్డకు 21 ఏళ్లు వచ్చిన తర్వాత మెచ్యూరిటీ మొత్తాన్ని తీసుకోవచ్చు. ఈ పథకంలో పెట్టుబడులకు సెక్షన్ 80సీ కింద పన్ను మినహాయింపు లభిస్తుంది. ఆడబిడ్డల భవిష్యత్తు కోసం ఎవరైనా సరే ఈ పథకాన్ని ఎంచుకోవడం ద్వారా ఎంతో ప్రయోజనం పొందవచ్చు.

నేషనల్ పెన్షన్ సిస్టమ్(ఎన్‌పీఎస్) స్కీమ్..

పెన్షన్‌తో పాటు పెట్టుబడిగా కూడా ఉపయోగపడే పథకమే ఎన్‌పీఎస్. ప్రభుత్వం రూపొందించిన ఈ పథకంలో 18-65 ఏళ్ల వయసు వారెవరైనా చేరవచ్చు. ఎన్‌పీఎస్ రిటైర్మెంట్‌ కార్పస్‌ మొత్తంపై పన్ను ఉండదు. ఈ పథకం ప్రారంభించ‌డానికి కేవ‌లం రూ. 1,000 చెల్లించాలి. ఆ త‌ర్వాత ఎంత మొత్తం అయినా చెల్లించ‌వ‌చ్చు. ఎన్‌పీఎస్ ఎంచుకున్న వారికి 80 సీ కింద ఒక ఆర్థిక సంవత్సరానికి రూ.1.50 ల‌క్ష‌ల ప‌రిమితి వ‌ర‌కు మిన‌హాయింపు పొంద‌డానికి అర్హ‌త పొంద‌డ‌మే కాకుండా, సెక్ష‌న్ 80 సీసీడీ (1బీ) రూ. 50 వరకు పన్ను మినహాయింపు కూడా ఉంటుంది. ఎన్‌పీఎస్ ఎంచుకున్నవారు ప‌ద‌వీ విర‌మ‌ణ వ‌య‌స్సు కంటే ముందే ఎన్‌పీఎస్ నుంచి బయటకు రావొచ్చు. లాక్-ఇన్ పీరియ‌డ్ 10 సంవ‌త్స‌రాల నుంచి ఇపుడు 5 సంవ‌త్స‌రాల‌కు తగ్గించారు. 60 ఏళ్ల వయసు కంటే ముందే విత్‌ డ్రా కావాలంటే 20 శాతాన్ని మాత్రమే తీసుకుని, 80 శాతం మొత్తాన్ని యాన్యుటీ రూపంలో ఉంచాలి. జమ చేసిన మొత్తం రూ. 2.50 ల‌క్ష‌ల కంటే త‌క్కువ ఉంటే మొత్తం ఒకేసారి ఉప‌సంహ‌రించుకోవ‌చ్చు.

పోస్ట్ ఆఫీస్ టైమ్ డిపాజిట్..

పోస్ట్ ఆఫీస్ అందించే టైమ్ డిపాజిట్ పథకం 1,2,3,4,5 ఏళ్ల కాలపరిమితితో కూడినది. కాలపరిమితి పూర్తయ్యాకే డిపాజిట్ మొత్తం ఇస్తారు. ఏడాదికి ఒకసారి వడ్డీని అందిస్తారు. ఇందులో ఎవరైనా డిపాజిట్ చేయవచ్చు. దీన్ని ఎంచుకున్న వారికి ఏడాది కాలానికి 6.6 శాతం, రెండేళ్లకు 6.8 శాతం, 3 ఏళ్లకు 6.9 శాతం, 5 ఏళ్లకు 7 శాతం వడ్డీ లభిస్తుంది. దీన్ని ప్రారంభించేందుకు కనీసం రూ. 1000 మొత్తం జమ చేయాలి. గరిష్ఠానికి పరిమితి లేదు. డిపాజిట్ చేసిన తేదీ నుండి ఆరు నెలల గడువులోపు ఎటువంటి విత్‌డ్రా చేయబడదు. అలాగే, ఇందులో సెక్షన్ 80సీ ప్రకారం రూ. 1.50 లక్షల వరకు పన్ను మినహాయింపు లభిస్తుంది. అయితే, తక్కువ డిపాజిట్లపై ఎలాంటి పన్ను ప్రయోజనాలు ఉండవని గుర్తించుకోవాలి. కానీ సీనియర్ సిటిజన్లకు సెక్షన 80టీటీబీ కింద ఒక ఆర్థిక సంవత్సరంలో రూ. 50 వేల వరకు మినహాయింపు ఉంటుంది. 60 ఏళ్ల కంటే చిన్న వయసు వారు ఒక ఆర్థిక సంవత్సరంలో రూ. 40 వేల కంటే ఎక్కువ వడ్డీ పొందితే టీడీఎస్ అమలవుతుంది.

పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్(పీఓఎంఐఎస్)..

ఈ పథకంలో చేరేందుకు కనీసం మొత్తం రూ. 1,000. సింగిల్, జాయింట్‌ ఖాతాలను తెరిచే వెసులుబాటు ఉంది. గరిష్ఠంగా ఏడాదికి సింగిల్ ఖాతా అయితే రూ. 4.5 లక్షలు, జాయింట్ అకౌంట్ అయితే రూ. 9 లక్షలుగా ఉంది. ఈ పథకంలో పెట్టుబడులకు ఏడాదికి 7.1 శాతం వడ్డీ లభిస్తుంది. వడ్డీని నెలవారీగా ఇస్తారు. డిపాజిట్‌ చేసిన ఐదేళ్ల తర్వాత పెట్టుబడి మొత్తాన్ని తిరిగి పొందుతారు. అయితే, ఈ ఖాతా ఎంచుకున్న వారికి పన్ను ప్రయోజనాలు లభించవు. ఇందులో జమ చేసిన మొత్తంపై వడ్డీకి పన్ను అమలవుతుంది. పోస్ట్ ఆఫీస్ టైమ్ డిపాజిట్ తరహాలోనే పన్ను మినహాయింపులు ఉంటాయి.

నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్స్(ఎన్ఎస్‌సీ)..

ఈ పథకంలో డిపాజిట్ చేసే వారికి ప్రస్తుతం 7 శాతం వడ్డీ లభిస్తోంది. ఇందులో ఎవరైనా ఖాతా తెరవొచ్చు. ఐదేళ్ల కాలపరిమితి ముగిసిన తర్వాత డిపాజిట్ మొత్తం మెచ్యూర్ అవుతుంది. ఈ పథకంలో వడ్డీ ఏడాది ప్రాతిపదికన ఉంటుంది. ఈ పథకంలో చేరేందుకు కనీసం రూ. 1000 పెట్టుబడి ఉండాలి. గరిష్ట పెట్టుబడి పరిమితి లేదు. డిపాజిట్ చేసిన తేదీ నుంచి 5 ఏళ్ల తర్వాత మొత్తం మెచ్యూరిటీ అందజేయబడుతుంది. ఈ పథకం ద్వారా ఒక ఆర్థిక సంవత్సరంలో 80సీ కింద రూ. 1.50 లక్షల వరకు పన్ను ప్రయోజనాలను పొందవచ్చు. అయితే, ఈ పథకం ద్వారా పొందే వడ్డీకి పన్ను వర్తిస్తుంది. అలాగే, ఈ పథకానికి టీడీఎస్ వర్తించదు. పెట్టుబడి సమయంలో ఐటీఆర్ దాఖలు చేసే సమయంలో ఈ పథకం నుంచి పొందిన వడ్డీని పేర్కొనాలి.

కిసాన్ వికాస్ పత్ర(కేవీపీ)..

కిసాన్ వికాస్ పత్ర పథకంలో డిపాజిట్ చేసిన మొత్తం 120 నెలల్లో రెట్టింపు అవుతుంది. ఈ పథకంలో కనిష్ఠంగా రూ. 1000 పెట్టుబడి పెట్టాలి. గరిష్ఠానికి పరిమితి లేదు. ఇందులో పెట్టుబడి ప్రారంభించిన నాటి నుంచి రెండున్నరేళ్ల తర్వాత విత్‌డ్రా చేసుకోవచ్చు. పెద్ద మొత్తంలో పెట్టుబడులకు ఇది ప్రయోజనకరం. అయితే, ఈ పథకంలో పెట్టిన పెట్టుబడులకు పన్ను ప్రయోజనాలు ఉండవు. ఇందులో పొందిన వడ్డీకి పన్ను చెల్లించాలి. అలాగే టీడీఎస్ వర్తించదు. ఈ పథకంపై అమలయ్యే పన్ను ఎన్ఎస్‌సీ్‌లో కంటే ఎక్కువగా ఉంటుంది.

పోస్టాఫీసు రికరింగ్ డిపాజిట్..

ఈ పథకంలో చేరాలంటే ఐదేళ్ల వరకు క్రమం తప్పకుండా నెలనెలా వాయిదాలను డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. దీనికి ఐదేళ్ల కాలపరిమితి ఉంటుంది. ప్రతి నెలా రూ. 100తో ఖాతాను కొనసాగించవచ్చు. మెచ్యూరిటీ అయ్యే వరకు డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. ఈ ఖాతాలో జమ చేసే మొత్తానికి ఏడాదికి 5.8 శాతం వడ్డీ లభిస్తుంది. నిర్ణీత కాలపరిమితి పూర్తయ్యాక మరో ఐదేళ్ల వరకు పొడిగించుకోవచ్చు. గరిష్ట కాల పరిమితి 10 ఏళ్లు మాత్రమే. ఈ పథకంలో జమ చేసే మొత్తానికి పన్ను మినహాయింపు ఉండదు.

Also Read...

బ్యాంకుల వడ్డీ రేట్ల గురించి పూర్తి వివరాలు..!

Advertisement

Next Story

Most Viewed