భారత మార్కెట్లలోకి ఇప్పటివరకు రూ. 7 వేల కోట్లకు పైగా విదేశీ పెట్టుబడులు!

by Mahesh |   ( Updated:2023-03-26 14:59:53.0  )
భారత మార్కెట్లలోకి ఇప్పటివరకు రూ. 7 వేల కోట్లకు పైగా విదేశీ పెట్టుబడులు!
X

ముంబై: భారత ఈక్విటీ మార్కెట్లలో గత మూడు నెలల నుంచి అమ్మకాలను కొనసాగించిన విదేశీ పెట్టుబడిదారులు మార్చిలో తిరిగి పెట్టుబడులు పెట్టారు. అమెరికా బ్యాంకింగ్ రంగంలో నెలకొన్న ఆందోళనలు, ప్రపంచ బ్యాంకింగ్ ఒత్తిడి కారణంగా విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు(ఎఫ్ఐఐ) అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. అయినప్పటికీ ఈ నెలలో ఇప్పటివరకు ఎఫ్ఐఐలు భారత ఈక్విటీ మార్కెట్లలో రూ. 7,200 కోట్లు ఇన్వెస్ట్ చేశారు.

ముఖ్యంగా అదానీ గ్రూప్‌లో అమెరికాకు చెందిన జీక్యూజీ పార్ట్‌నర్స్ మద్దతుతో భారీ పెట్టుబడి వచ్చి చేరింది. ఈ నెల ప్రారంభంలో సిలికాన్ వ్యాలీ బ్యాంక్, సిగ్నేచర్ బ్యాంకుల పతనంతో యూఎస్ బ్యాంకింగ్ రంగం ఒత్తిడికి గురైంది. యూరప్, యూఎస్ బ్యాంకుల్లో ప్రతికూల పరిస్థితుల వల్ల మొత్తంగా విదేశీ మదుపర్ల సెంటిమెంట్ బలహీనంగా ఉందని కోటక్ సెక్యూరిటీస్ ఈక్విటీ రీసెర్చ్(రిటైల్) హెడ్ శ్రీకాంత్ చౌహాన్ చెప్పారు.

డిపాజిటరీ గణాంకాల ప్రకారం, ఎఫ్ఐఐలు మార్చిలో ఇప్పటివరకు రూ. 7,233 కోట్ల పెట్టుబడులను భారత మార్కెట్లో పెట్టారు. అంతకుముందు ఫిబ్రవరిలో రూ. 5,294 కోట్లు, జనవరిలో రూ. 28,852 కోట్ల విలువైన షేర్లను విక్రయించారు. నాలుగు అదానీ కంపెనీల్లో జీక్యూజీ పార్ట్‌నర్స్ రూ. 15,446 కోట్ల బల్క్ ఇన్వెస్ట్‌మెంట్‌తో మార్చి విదేశీ పెట్టుబడుల్లో వృద్ధి కనిపించిందని జియోజిత్ ఫైనాన్షియల్ చీఫ్ ఇన్వెస్ట్‌మెంట్ స్ట్రాటజిస్ట్ వికె విజయకుమార్ అన్నారు.

ఇది మినహాయిస్తే ఎఫ్ఐఐల పెట్టుబడుల ధోరణి ప్రతికూలంగా ఉందని ఆయన తెలిపారు. ప్రస్తుత కేలండర్ ఏడాదిలో ఇప్పటివరకు ఎఫ్ఐఐలు రూ. 26,913 కోట్ల విలువైన షేర్లను విక్రయించారు. అంతర్జాతీయంగా నెలకొన్న అనిశ్చితి వల్ల అభివృద్ధి చెందుతున్న భారత్ లాంటి దేశాల్లో విదేశీ మదుపర్లు అమ్మకాలను కొనసాగిస్తున్నారని ఆయన పేర్కొన్నారు.

Advertisement

Next Story