YouTube Ex-CEO: యూట్యూబ్ మాజీ సీఈఓ సుసాన్ వొజ్కికి మృతి

by Harish |   ( Updated:2024-08-10 09:25:36.0  )
YouTube Ex-CEO: యూట్యూబ్ మాజీ సీఈఓ సుసాన్ వొజ్కికి  మృతి
X

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రముఖ వీడియో స్ట్రీమింగ్ యూట్యూబ్‌ను అగ్రగామిగా నిలబెట్టడంలో కీలక పాత్ర పోషించిన మాజీ సీఈఓ సుసాన్ వొజ్కికి క్యాన్సర్‌తో పోరాడుతూ మరణించారు. ఈ విషయాన్ని గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ శనివారం తెలిపారు. 1998లో గూగుల్‌లో చేరిన ఆమె 2014 నుంచి 2023 వరకు యూట్యూబ్ సీఈఓగా పనిచేశారు. రెండేళ్లుగా ఊపిరితిత్తుల క్యాన్సర్‌తో పోరాడుతున్న ఆమె ఆరోగ్య పరిస్థితి మరింత క్షీణించడంతో తుది శ్వాస విడిచారు. ఆమె హయంలోనే యూట్యూబ్‌ ప్రీమియం, యూట్యూబ్‌ టీవీ, యూట్యూబ్‌ షార్ట్స్‌ వంటి వాటిని తీసుకొచ్చారు.

ఆమె నాయకత్వంలో యూట్యూబ్ ఆదాయం గణనీయంగా పెరిగింది. సరికొత్త నిర్ణయాలతో ఇంటర్నెట్ యుగంలో వీడియో స్ట్రీమింగ్ అంటే యూట్యూబ్ గుర్తుకు వచ్చేలా చేశారు. యూట్యూబ్ వీక్షకుల సంఖ్య 2.5 బిలియన్ల నెలవారీ వినియోగదారులకు విస్తరించింది. 2006లో గూగుల్ యూట్యూబ్‌ని $1.65 బిలియన్లకు కొనుగోలు చేయడంలో ఆమె కీలక పాత్ర పోషించింది.

సుసాన్ వొజ్కికి మరణంపై గూగుల్, ఆల్ఫాబెట్ సీఈఓ సుందర్ పిచాయ్ , సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ Xలో ఆమెకు నివాళులర్పించారు, రెండేళ్ల పాటు క్యాన్సర్‌తో జీవించిన నా ప్రియమైన స్నేహితురాలు మృతి చెందడం బాధాకరం. గూగుల్ చరిత్రలో ఆమెది కీలక పాత్ర. ఆమె లేని ప్రపంచాన్ని ఊహించుకోవడం కష్టం అని పిచాయ్ X లో పోస్ట్ చేశారు.

సుసాన్ వొజ్కికి 1998లో, తన గ్యారేజీని Google సహ-వ్యవస్థాపకులు లారీ పేజ్, సెర్గీ బ్రిన్‌లకు అద్దెకు ఇచ్చింది. 1999లో గూగుల్‌లో 16వ ఉద్యోగిగా చేరి, మొదటి మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేశారు. ఆమె గూగుల్‌‌లో AdWords, AdSense, DoubleClick, Google Analyticsతో సహా కీలక ప్రకటనలు, విశ్లేషణల ఉత్పత్తులను అభివృద్ధి చేయడంలో కీలక పాత్ర పోషించింది. గూగుల్ ఇమేజెస్, గూగుల్ బుక్స్ వంటి ఉత్పత్తుల సృష్టికి ఆమె నాయకత్వం వహించారు. యూట్యూబ్‌ని $1.65 బిలియన్లకు కొనుగోలు చేయడంలోను ఆమె హస్తం ఉంది. 2014లో వొజ్కికి యూట్యూబ్ సీఈఓగా నియమితులై దానిని అభివృద్ధి చేయడంలో ముఖ్య పాత్ర పోషించారు.

Advertisement

Next Story

Most Viewed