రైలు ప్రయాణికులకు స్విగ్గీ ఫుడ్ డెలివరీ సేవలు

by S Gopi |
రైలు ప్రయాణికులకు స్విగ్గీ ఫుడ్ డెలివరీ సేవలు
X

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రముఖ ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్ స్విగ్గీ ఇకపై రైళ్లలో ప్రయాణికులకు డెలివరీ సేవలు అందించనుంది. ప్రయాణికులు కూడా తమకు నచ్చిన రెస్టారెంట్ నుంచి ఆహారాన్ని ఆర్డర్ చేయవచ్చు. దీనికోసం ఐఆర్‌సీటీసీ, స్విగ్గీ మంగళవారం అవగాహనా ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఈ సేవలు మార్చి 12వ తేదీ నుంచి అమల్లోకి వస్తాయని, మొదట బెంగళూరు, విజయవాడ, విశాఖపట్నం, భువనేశ్వర్ స్టేషన్లలో అందుబాటులోకి తీసుకురానున్నట్టు స్విగ్గీ వెల్లడించింది. రాబోయే ఆరు నెలల్లో 59కి పైగా స్టేషన్‌లకు ఈ సేవలను విస్తరించాలని కంపెనీ భావిస్తోంది. స్విగ్గీలో ఆహారం ఆర్డర్ చేయాలనుకునే ప్రయాణీకులు ఐఆర్‌సీటీసీ యాప్ నుంచి చేసుకోవాల్సి ఉంటుంది. పీఎన్ఆర్ నంబర్‌ను ఎంటర్ చేయడం ద్వారా కావాల్సిన ఆహారం స్టేషన్‌లో డెలివరీ తీసుకోవచ్చు. స్విగ్గీతో ఒప్పందం ద్వారా ప్రయాణికులు మరింత మెరుగైన ప్రయాణ సౌకర్యాలను పొందుతారని ఐఆర్‌సీటీసీ ఛైర్మన్, ఎండీ సంజయ్ కుమార్ జైన్ చెప్పారు. ఈ కొత్త సేవలను ప్రయాణికులు ఇష్టపడతారని భావిస్తున్నట్టు స్విగ్గీ సీఈఓ రోహిత్ కుమార్ పేర్కొన్నారు.

Advertisement

Next Story