Content: కంటెంట్ ట్రాకింగ్ సిస్టం అవసరం: EY-FICCI

by Harish |   ( Updated:2024-09-19 11:53:05.0  )
Content: కంటెంట్ ట్రాకింగ్ సిస్టం అవసరం: EY-FICCI
X

దిశ, బిజినెస్ బ్యూరో: సాంకేతిక యుగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగం క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో డిజిటల్ కంటెంట్ మార్కెట్లో దూసుకుపోతుంది. అయితే ఇటీవల కాలంలో దీనిలో పలు సమస్యలు కూడా ఉత్పన్నమవుతున్నాయి. సాధారణంగా మనుషులు రాసిన కంటెంట్‌తో పాటు, AI ఆధారిత కంటెంట్(content) సైతం వస్తుండటంతో దాని మూలం, ప్రామాణికతపై ఆందోళనలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో భారతదేశం కంటెంట్ ట్రాకింగ్ వ్యవస్థను అభివృద్ధి చేయడంపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని EY-FICCI నివేదిక పేర్కొంది.

ఒక వార్త లేదా కంటెంట్ ప్రజలపై ఎంతో ప్రభావం చూపిస్తుంది. తప్పుడు కంటెంట్ ద్వారా తప్పుడు సమాచారం ప్రజలకు చేరువయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం కంటెంట్ విషయంలో AI రాసిన-మనుషులు రాసిన కంటెంట్ మధ్య తేడాలను గుర్తించడం చాలా కష్టంగా ఉంది. దీని ద్వారా తప్పుడు సమాచారం, కాపీరైట్ ఉల్లంఘన, డిజిటల్ కంటెంట్‌లో విశ్వసనీయత కోల్పోవడం వంటి సమస్యలు వస్తున్నట్లు నివేదిక తెలిపింది.

మనుషులు తమ సొంతంగా రాసిన కంటెంట్ నుంచి AI కంటెంట్‌ను వేరు చేయాల్సిన అవసరం ఉందని, ఈ కంటెంట్‌ను గుర్తించడానికి కొత్త సాంకేతికతను అభివృద్ది చేయాలని నివేదిక తెలిపింది. బలమైన AI కంటెంట్ డిటెక్షన్ మెకానిజంను నిర్మించడానికి ఒక వాటర్‌మార్కింగ్ విధానం అవసరమని సూచించింది. ఈ సమస్యలను పరిష్కరించడానికి వాటర్‌మార్కింగ్ విధానం బాగా ఉపయోగపడుతుందని నివేదిక హైలెట్ చేసింది. డెవలపర్‌లు వాటర్‌మార్క్‌లు ఎన్‌క్రిప్ట్ చేయడం వలన, AI-ఉత్పత్తి చేసిన కంటెంట్‌ను వేగంగా గుర్తించడం, దాని ప్రామాణికతను అందించడానికి వీలు కల్పించే కీలకమైన పరిష్కారం అని EY ఇండియా అధికారి రజనీష్ గుప్తా తెలిపారు.

Advertisement

Next Story