60 శాతం పెరిగిన విమాన ప్రయాణీకుల రద్దీ!

by Harish |   ( Updated:2023-04-12 14:16:30.0  )
60 శాతం పెరిగిన విమాన ప్రయాణీకుల రద్దీ!
X

న్యూఢిల్లీ: గత ఆర్థిక సంవత్సరంలో దేశీయ విమానయాన పరిశ్రమ రికవరీ బాటలో పయనించిందని ప్రముఖ పరిశోధనా సంస్థ ఇక్రా బుధవారం ప్రకటనలో తెలిపింది. గత ఏడాది 60 శాతం వృద్ధితో పరిశ్రమలో ప్రయాణీకుల రద్దీ 13.60 కోట్లకు పెరిగింది. అయినప్పటికీ, 14.15 కోట్లతో కరోనాకు ముందు(2019-20) నాటి కంటే 4 శాతం కంటే తక్కువగా ఉందని ఇక్రా వెల్లడించింది.

ఇక్రా తాజా గణాంకాల ప్రకారం, గత ఏడాది మార్చితో ముగిసిన సంవత్సరంలో మొత్తం 8.52 కోట్ల మంది ప్రయాణీకులు దేశీయ రూట్లలో ప్రయాణించారని భారత విమానయాన సంస్థలు తెలిపాయి. అలాగే, ఈ ఏడాది మార్చిలో దేశీయ విమాన ప్రయాణీకుల రద్దీ 1.30 కోట్లుగా ఉంది. గతేడాది ఇదే నెలతో పోలిస్తే ఇది 22 శాతం అధికమని ఇక్రా వైస్-ప్రెసిడెంట్ సుప్రియో బెనర్జీ చెప్పారు.

దేశీయ విమానయాన ప్రయాణీకుల రద్దీ విషయంలో పరిశ్రమ మెరుగైన వృద్ధిని చూసినప్పటికీ, ఏవియేషన్ టర్బైన్ ఇంధనం(ఏటీఎఫ్) ధరలు పెరగడం, అమెరికా డాలరుతో పోలిస్తే రూపాయి మారకం బలహీనపడటం వంటి సవాళ్లు పరిశ్రమను వెంటాడుతున్నాయని ఇక్రా అభిప్రాయపడింది. తమ ఇన్‌పుట్ ఖర్చుల పెరుగుదలకు అనుగుణంగా ఛార్జీల పెంపు ఉండేలా విమానయాన సంస్థలు చేస్తున్న ప్రయత్నాలు లాభదాయకతను పెంచేందుకు దోహదపడవచ్చని సుప్రియో బెనర్జీ పేర్కొన్నారు.

Also Read..

వరుసగా ఎనిమిదో రోజు లాభాలు!

Advertisement

Next Story