Flights: భారత్-చైనా మధ్య డైరెక్ట్ పౌర విమానాల రాకపోకలపై చర్చ

by Harish |
Flights: భారత్-చైనా మధ్య డైరెక్ట్ పౌర విమానాల రాకపోకలపై చర్చ
X

దిశ, బిజినెస్ బ్యూరో: భారత్-చైనా దేశాల మధ్య డైరెక్ట్ ప్రయాణికుల విమానాల రాకపోకలు గత నాలుగేళ్లుగా నిలిచిపోగా, తాజాగా విమానాలను త్వరగా పునః ప్రారంభించడంపై చర్చించినట్లు భారత పౌర విమానయాన శాఖ మంత్రి రామ్ మోహన్ నాయుడు గురువారం తెలిపారు. 2020లో హిమాలయ సరిహద్దులో రెండు దేశాల మధ్య జరిగిన సైనిక ఘర్షణలో పలువురు భారత సైనికులు మరణించగా అప్పటి నుంచి భారత్, చైనాకు ప్రయాణికుల విమానాల రాకపోకలను నిలిపివేసింది. కేవలం వాణిజ్యం కోసం కార్గో విమానాలను మాత్రం నడుపుతున్నారు. ఇరు దేశాల మధ్య ప్రయాణించే వారు శ్రీలంక వంటి ఇతర దేశాల మీదుగా ప్రయాణాలు సాగిస్తున్నారు.

ఈ నేపథ్యంలో నేరుగా విమానాల రాకపోకలను తిరిగి పునరుద్ధరించాలని చైనా గత కొంత కాలంగా భారత్‌పై ఒత్తిడి తెస్తుంది. అయినప్పటికీ కేంద్రం మాత్రం అందుకు ససేమిరా అంటుంది. ఈ క్రమంలో తాజాగా న్యూఢిల్లీలో పౌరవిమానయానంపై ఆసియా-పసిఫిక్ మినిస్టీరియల్ కాన్ఫరెన్స్ సందర్భంగా చైనా సివిల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ అధిపతి సాంగ్ జియాంగ్‌ను కలిసినట్లు పౌర విమానయాన శాఖ మంత్రి తెలిపారు. రెండు దేశాల మధ్య పౌర విమానయాన సహకారాన్ని మరింత బలోపేతం చేయడం, ముఖ్యంగా షెడ్యూల్డ్ ప్యాసింజర్ విమానాల పునః ప్రారంభించడంపై ఇద్దరం చర్చించామని ఎక్స్‌లో మంత్రి చెప్పారు. డైరెక్ట్ ఫ్లైట్‌లను పునఃప్రారంభించడం ద్వారా రెండు దేశాలకు సహాయపడుతుందని సాంగ్ జియాంగ్‌ తెలిపారు.

2020లో లడఖ్‌లోని గాల్వాన్ లోయలో భారత్-చైనా సైనికుల మధ్య హింసాత్మక ఘర్షణ జరిగింది. ఈ ఘటనలో కల్నల్‌తో సహా 20 మంది భారతీయ సైనికులు మరణించారు. అప్పటి నుంచి భారత్, చైనా పట్ల చాలా కఠినంగా వ్యవహరిస్తుంది. ఆ దేశం నుంచి వచ్చే పెట్టుబడులను కఠినతరం చేసింది, వందలాది ప్రసిద్ధ యాప్‌లను నిషేధించింది, ప్రయాణికుల విమాన రాకపోకలను నిలిపివేసింది.

Advertisement

Next Story

Most Viewed