సరికొత్త రికార్డు గరిష్ఠాలకు స్టాక్ మార్కెట్లు

by S Gopi |
సరికొత్త రికార్డు గరిష్ఠాలకు స్టాక్ మార్కెట్లు
X

దిశ, బిజినెస్ బ్యూరో: దేశీయ ఈక్విటీ మార్కెట్లు సరికొత్త రికార్డులను సాధించాయి. వరుస మూడు రోజుల సెలవు తర్వాత మంగళవారం ట్రేడింగ్ మొదలైన తర్వాత సూచీలు ప్రారంభంలోనే గణనీయమైన ర్యాలీని చూశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలకు తోడు కీలక బ్యాంకింగ్, ఐటీ రంగాల షేర్లలో కొనుగోళ్లు కొత్త గరిష్ఠాలకు చేర్చాయి. వచ్చే నెలలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2024-25 కోసం సమగ్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఎన్నికల ఫలితాల నేపథ్యంలో ఈ బడ్జెట్ వృద్ధి, సామాన్యులకు అనుకూలంగా ఉంటుందనే అంచనాలతో సెన్సెక్స్ 77,366, నిఫ్టీ 23,579 రికార్డు స్థాయిని తాకాయి. దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 308.37 పాయింట్లు లాభపడి 77,301 వద్ద, నిఫ్టీ 92.30 పాయింట్ల లాభంతో 23,557 వద్ద ముగిశాయి. నిఫ్టీలో ప్రైవేట్ బ్యాంక్, రియల్టీ, ఫైనాన్స్, ఐటీ రంగాలు రాణించాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లో పవర్‌గ్రిడ్, విప్రో, టైటాన్, ఐసీఐసీఐ బ్యాంక్, ఎంఅండ్ఎం, యాక్సిస్ బ్యాంక్ షేర్లు లాభాలను సాధించాయి. మారుతీ సుజుకి, టాటా స్టీల్, ఆల్ట్రా సిమెంట్, టాటా మోటార్స్, ఐటీసీ, టీసీఎస్ స్టాక్స్ నష్టాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 83.42 వద్ద ఉంది. స్టాక్ మార్కెట్ల రికార్డు ర్యాలీ కారణనగా మదుపర్ల సంపద ఒక్కరోజే రూ. 2.42 లక్షల కోట్లు పెరగడంతో బీఎస్ఈ మార్కెట్ క్యాప్ రూ. 437.3 లక్షల కోట్లకు చేరింది.

Advertisement

Next Story

Most Viewed