'క్రిప్టో కింగ్‌' శామ్‌ బ్యాంక్‌మన్‌కు 25 ఏళ్ల జైలు శిక్ష

by S Gopi |
క్రిప్టో కింగ్‌ శామ్‌ బ్యాంక్‌మన్‌కు 25 ఏళ్ల జైలు శిక్ష
X

దిశ, బిజినెస్ బ్యూరో: క్రిప్టో కరెన్సీలో దివాలా తీసిన ఎఫ్‌టీఎక్స్ సహ-వ్యవస్థాపకుడు, క్రిప్టో కింగ్‌గా పేరున్న శామ్ బ్యాంక్‌మన్ ఫ్రీడ్‌కు అమెరికాలోని న్యూయార్క్ కోర్టు 25 ఏళ్ల జైలు శిక్ష విధించింది. కస్టమర్ల నుంచి 8 బిలియన్ డాలర్లకు(మన కరెన్సీలో సుమారు రూ. 67 వేల కోట్లు) పైగా మోసం చేసిన కారణంగా అతడికి కోర్టు శిక్ష విధించింది. రెండేళ్లు వాదనలు సాగిన ఈ కేసులో ఎఫ్‌టీఎక్స్ కస్టమర్లు డబ్బులు పోగొట్టుకోలేదని బ్యాంక్‌మన్ చేసిన వాదనను తిరస్కరించిన కోర్టు శిక్షను ఖరారు చేసింది.

ప్రపంచవ్యాప్తంగా క్రిప్టో కరెన్సీ ఎక్స్ఛేంజ్‌లో ఎక్కువ ఆదరణ ఉన్న ఎఫ్‌టీఎక్ ప్లాట్‌ఫామ్ 2022లో కుప్పకూలింది. 99 శాతం బిలియన్ డాలర్ల సంపద ఆవిరైంది. దీనివల్ల కోట్లాది మంది పెట్టుబడిదారులు భారీగా నష్టపోయారు. అమెరికా చరిత్రలో ఆర్థిక మోసాల్లోనే ఒకటిగా నిలిచిన ఈ ఎఫ్‌టీఎక్స్ వ్యవహారంలో తప్పు తెలిసినప్పటికీ బ్యాంక్‌మన్ మోసాలకు పాల్పడినట్టు ప్రభుత్వం తరపు న్యాయవాది తెలిపారు. కస్టమర్ల సొమ్ము ఇతర మార్గాల్లో తరలిస్తున్నట్టు తెలియదని బ్యాంక్‌మన్ చెప్పిన మాటలు అబద్దమని, కంపెనీలో జరుగుతున్న తప్పుల గురించి అతనికి ముందే తెలుసని లాయర్లు స్పష్టం చేశారు. ఈ విషయంలో మోసం చేసినట్టు భావించినప్పటికీ విచారణలో అంగీకరించలేదన్నారు. బ్యాంక్‌మన్ తరపు లాయర్లు శిక్షను ఐదు నుంచి ఆరున్నరేళ్లకు తగ్గించాలని కోరారు. బ్యాంక్‌మన్ ఎలాంటి హింసకు పాల్పడలేదని, ఇది అతని జీవితంలోనే మొదటి నేరమన్నారు. సంస్థ దివాలా ప్రక్రియలో ఉన్నందున కస్టమర్లు కోల్పోయిన డబ్బులో ఎక్కువ భాగం తిరిగి పొందుతారని వివరించారు. ఈ అంశాలను పరిగణలోకి తీసుకుని శిక్షను తగ్గించాలని విజ్ఞప్తి చేశారు. అయితే, ప్రభుత్వ లాయర్లు నిబంధనల ప్రకారం 100 ఏళ్ల జైలు శిక్ష విధించాలని, భవిష్యత్తులో తీవ్ర నేరాలకు పాల్పడే ప్రమాదం ఉందన్నారు. కాగా, తీర్పు వెలువడటానికి ముందు బ్యాంక్‌మన్ పశ్చాత్తాపానికి లోనయ్యాడు. తన వల్ల చాలామంది బాధపడ్డారని, అందరికీ క్షమాపణలు చెబుతున్నానన్నారు.

Advertisement

Next Story