SEBI: సెబీ చీఫ్‌‌పై కాంగ్రెస్ మరోసారి సంచలన ఆరోపణలు

by Harish |
SEBI: సెబీ చీఫ్‌‌పై కాంగ్రెస్ మరోసారి సంచలన ఆరోపణలు
X

దిశ, బిజినెస్ బ్యూరో: ఇటీవల వరుసగా తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న మార్కెట్ రెగ్యులేటరీ సంస్థ(సెబీ) చీఫ్ మధబి పురీ బుచ్‌పై తాజాగా కాంగ్రెస్ మరోసారి సంచలన ఆరోపణలు చేసింది. చైర్‌పర్సన్ హోదాలో ఉన్న ఆమె తన పదవీకాలంలో లిస్టెడ్ సెక్యూరిటీలలో రూ.36.9 కోట్ల విలువైన ట్రేడింగ్ చేయడం ద్వారా సెబీ నిబంధనలు ఉల్లంఘించారని విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ ప్రతినిధి పవన్ ఖేరా ఆరోపించారు. 2017 నుంచి 2023 మధ్యకాలంలో ఈ ట్రేడింగ్ కార్యకలాపాలు జరిగాయని, 2018-19 ఆర్థిక సంవత్సరంలో గణనీయమైన లావాదేవీలు నమోదయ్యాయని, ఈ సమయంలో ట్రేడింగ్ విలువ రూ.19.54 కోట్లు అని ఖేరా పేర్కొన్నారు.

అలాగే, ఆమె విదేశీ ఫండ్‌లలో పెట్టుబడులు పెట్టినట్లు కూడా ఆయన ఆరోపణలు చేశారు. వీటిలో చైనాకు చెందిన కంపెనీలు కూడా ఉన్నాయని అన్నారు. గ్లోబల్ X MSCI చైనా కన్స్యూమర్, ఇన్వెస్కో చైనా టెక్నాలజీ ETF అనే నాలుగు అంతర్జాతీయ ఫండ్‌లలో బుచ్ ఇన్వెస్ట్ చేసినట్లు ఖేరా పేర్కొన్నారు. ఈ సందర్భంగా బుచ్ ఈ విదేశీ ఆస్తులను ఎప్పుడు ప్రకటించారని, ఈ పెట్టుబడుల గురించి ఆమె ఏ ప్రభుత్వ సంస్థకు తెలియజేసిందని ఆయన ప్రశ్నించారు.

ఈ ఆరోపణల నేపథ్యంలో జైరాం రమేశ్‌ కూడా, ప్రధాని మోడీపై విమర్శలు చేస్తూ, పలు ప్రశ్నలను సంధించారు. సెబీ చైర్‌పర్సన్ లిస్టెడ్ సెక్యూరిటీలలో ట్రేడింగ్ చేస్తున్నారని ప్రధానికి తెలుసా ? ఆమె దేశం వెలుపల పెట్టుబడులు పెట్టారని తెలుసా? ఒకవేళ తెలిస్తే, ఈ పెట్టుబడి తేదీ, వివరాలను బయటకు చెప్పగలరా? చైనాతో కొనసాగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల మధ్య చైనీస్ సంస్థలలో బుచ్ పెట్టుబడుల గురించి ప్రధానికి తెలియదా అని ఆయన ప్రశ్నించారు.

Advertisement

Next Story

Most Viewed