జెట్ ఎయిర్‌వేస్ వ్యవస్థాపకుడి ఇళ్లు, ఆఫీసుల్లో సీబీఐ సోదాలు!

by Harish |
జెట్ ఎయిర్‌వేస్ వ్యవస్థాపకుడి ఇళ్లు, ఆఫీసుల్లో సీబీఐ సోదాలు!
X

న్యూఢిల్లీ: విమానయాన సంస్థ జెట్ ఎయిర్‌వేస్ వ్యవస్థాపకుడు నరేష్ గోయల్ ఇళ్లు, పాత కార్యాలయాలతో సహా ఏడు ప్రాంతాల్లో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(సీబీఐ) శుక్రవారం దాడులు చేసినట్టు అధికారులు తెలిపారు. రూ. 538 కోట్ల మేర బ్యాంక్ మోసం కేసులో ఈ సోదాలు చేసినట్లు వెల్లడించారు. ప్రభుత్వ రంగ కెనరా బ్యాంక్ ఫిర్యాదు మేరకు నరేష్ గోయల్, ఆయన భార్య అనిత, మాజీ డైరెక్టర్ గౌరంగ్ ఆనంద శెట్టి, ఇంకా పలువురు బ్యాంకు అధికారులపై సీబీఐ కేసు నమోదు చేసింది.

ముంబైలోని పలు ప్రాంతాల్లో సీబీఐ సోదాలు నిర్వహించగా, గోయల్, ఆయన భార్య అనిత, మాజీ ఎయిర్‌లైన్ డైరెక్టర్ గౌరంగ్ ఆనంద శెట్టి నివాసాలు, కార్యాలయాల్లో సోదాలు జరిగాయి. పలు అవకతవకలతో పాటు నిధుల మళ్లింపుకు సంబంధించిన ఆరోపణలు ఉన్నాయని అధికారులు స్పష్టం చేశారు.

ఒకప్పుడు దేశీయంగా అతిపెద్ద ప్రైవేట్ రంగ విమానయాన సంస్థగా ఉన్న జెట్ ఎయిర్‌వేస్ తీవ్రమైన నగదు కొరత సమస్యను ఎదుర్కొంది. అప్పుల భారంతో ఉన్న సంస్థ 2019, ఏప్రిల్‌లో కార్యకలాపాలను నిలిపేసింది. నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్(ఎన్‌సీఎల్‌టీ)లో సుధీర్ఘ దివాలా ప్రక్రియ తర్వాత 2021, జూన్‌లో జలాన్ కల్‌రాక్ కన్సార్టియం కొనుగోలు చేసింది. ప్రస్తుతం సంస్థను పునరుద్ధరించే ప్రక్రియలో కన్సార్టియం ఉంది.

Advertisement

Next Story

Most Viewed