కాంపాకోలా ఎఫెక్ట్: ధర తగ్గించిన కోకాకోలా కంపెనీ!

by Harish |
కాంపాకోలా ఎఫెక్ట్: ధర తగ్గించిన కోకాకోలా కంపెనీ!
X

న్యూఢిల్లీ: ఇటీవల రిలయన్స్ సంస్థ యాభై ఏళ్ల నాటి కాంపాకోలా బ్రాండ్‌ను తిరిగి దేశీయ మార్కెట్లో విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఒకప్పుడు దేశీయ వినియోగదారుల్లో అత్యంత ఆదరణ పొందిన బ్రాండ్ తిరిగి రావడంతో సాఫ్ట్‌డ్రింక్ రంగంలోని ఇతర కంపెనీలు అప్రమత్తమయ్యాయి. అందులో భాగంగానే ప్రముఖ గ్లోబల్ దిగ్గజ సాఫ్ట్‌డ్రింక్ బ్రాండ్ కోకా-కోలా ధరలను తగ్గిస్తున్నట్టు ప్రకటించింది. ఎంపిక చేసిన కొన్ని రాష్ట్రాల్లో తన 200ఎంఎల్ కోకాకోలా బాటిల్ ధరపై రూ. 5 తగ్గించినట్టు తెలుస్తోంది.

రానున్న రోజుల్లో పరిశ్రమలో పోటీ తట్టుకునేందుకు మరిన్ని వ్యూహాల కోసం కంపెనీ ప్రయత్నిస్తోంది. ధర తగ్గించడంతో పాటు కంపెనీ ఇతర తగ్గింపు ప్రయోజనాలు, స్థానిక మార్కెటింగ్ ఖర్చులపై దృష్టి సారించనుంది. ప్రస్తుతానికి కంపెనీ నుంచి ఇతర వివరాలపై అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది.

రిలయన్స్ రిటైల్ సంస్థ కాంపాకోలాను కోలా, నిమ్మ, నారింజ ఫ్లేవర్లలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో అందుబాటులోకి తీసుకొచ్చింది. త్వరలో ఇతర రాష్ట్రాలకు విస్తరించనున్నట్టు స్పష్టం చేసింది. కాంపాకోలా రాకతో త్వరలో సాఫ్ట్‌డ్రింక్ మార్కెట్‌లో పోటీ తీవ్రతరం కానుందని, రిలయన్స్ మరిన్ని ఫ్లేవర్‌లను తీసుకురావడమే కాకుండా కోకాక్-కోలా, పెప్సీ ధరల కంటే తక్కువకే ప్రజలకు చేరువ చేయొచ్చని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

Advertisement

Next Story