75 వేల పైన ముగిసిన సెన్సెక్స్

by S Gopi |
75 వేల పైన ముగిసిన సెన్సెక్స్
X

దిశ, బిజినెస్ బ్యూరో: భారత ఈక్విటీ మార్కెట్లు లాభాలను సాధించాయి. అంతకుముందు సెషన్‌లో రికార్డు గరిష్ఠాల నుంచి కొంత వెనక్కి తగ్గిన సూచీలు బుధవారం తిరిగి పుంజుకున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలకు తోడు దేశీయంగా కీలక రిలయన్స్, భారత ఎయిర్‌టెల్, ఐటీసీ కంపెనీల షేర్లలో కొనుగోళ్ల జోరు లాభాలకు కారణమయ్యాయి. అమెరికాలో ద్రవ్యోల్బణ గణాంకాల విడుదల ఉన్న నేపథ్యంలో గ్లోబల్ మార్కెట్లు రాణించాయి. ఆ ప్రభావంతో దేశీయంగా బ్యాంకింగ్, ఎనర్జీ, ఐటీ రంగాల షేర్లలో ఇన్వెస్టర్లు ఎక్కువ కొనుగోళ్లు జరిపారు. ఈ క్రమంలోనే సెన్సెక్స్ ఇండెక్స్ మొదటిసారి 75,000 పాయింట్లకు పైన, నిఫ్టీ 22,700 ఎగువకు చేరాయి. మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 354.45 పాయింట్లు లాభపడి 75,038 వద్ద, నిఫ్టీ 111.05 పాయింట్ల లాభంతో 22,753 వద్ద ముగిశాయి. నిఫ్టీలో బ్యాంకింగ్, మీడియా, మెటల్, ఎఫ్ఎంసీజీ రంగాలు రాణించాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లో ఐటీసీ, కోటక్ బ్యాంక్, భారతీ ఎయిర్‌టెల్, ఎస్‌బీఐ, ఏషియన్ పెయింట్, టెక్ మహీంద్రా, రిలయన్స్ షేర్లు అధిక లాభాలను సాధించాయి. మారుతీ సుజుకి, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఎల్అండ్‌టీ, ఎంఅండ్ఎం, టాటా స్టీల్, బజాజ్ ఫిన్‌సర్వ్ స్టాక్స్ నష్టాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 83.21 వద్ద ఉంది.

Advertisement

Next Story