Stock exchanges: చమురు సంస్థలపై బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈ జరిమానా

by Harish |
Stock exchanges: చమురు సంస్థలపై బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈ జరిమానా
X

దిశ, బిజినెస్ బ్యూరో: దేశంలో అతిపెద్ద చమురు సంస్థలైన హెచ్‌పీసీఎల్‌, బీపీసీఎల్‌, ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్, ఆయిల్‌ ఇండియా, గెయిల్‌, మంగళూరు రిఫైనరీ అండ్ పెట్రోకెమికల్స్ లిమిటెడ్‌లపై స్టాక్‌ ఎక్స్ఛేంజీలు బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈలు జరిమానా విధించాయి. నిబంధనల ప్రకారం, ఆయా కంపెనీల బోర్డుల్లో నిర్దేశిత సంఖ్యలో స్వతంత్ర, మహిళా డైరెక్టర్లను నియమించనందుకు స్టాక్‌ ఎక్స్ఛేంజీలు ఈ చర్యలు తీసుకున్నాయి. అయితే ఇలా జరిమానా విధించడం రికార్డు స్థాయిలో వరుసగా ఐదో త్రైమాసికం కావడం గమనార్హం. జరిమానాకు సంబంధించిన విషయాన్ని ఆయా కంపెనీలు స్టాక్‌ ఎక్స్ఛేంజీల ఫైలింగ్‌లో పేర్కొన్నాయి. ఈ జరిమానాపై స్పందించిన సంస్థలు.. డైరెక్టర్ల నియామకం ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉంటుందని అందులో తమ పాత్ర లేదని తెలిపాయి. సాధారణంగా నిబంధనల ప్రకారం కంపెనీలకు ఎగ్జిక్యూటివ్ లేదా ఫంక్షనల్ డైరెక్టర్ల నిష్పత్తిలో స్వతంత్ర డైరెక్టర్లూ ఉండాలి. కనీసం ఒక మహిళా డైరెక్టర్‌కు స్థానం కల్పించాలి. అయితే ఈ నిబంధనలు పాటించనందుకు జరిమానా విధించారు.

Advertisement

Next Story