వారాంతం భారీగా పతనమైన స్టాక్ మార్కెట్లు!

by Harish |
వారాంతం భారీగా పతనమైన స్టాక్ మార్కెట్లు!
X

ముంబై: దేశీయ ఈక్విటీ మార్కెట్లలో భారీ నష్టాలు నమోదయ్యాయి. గత రెండు వారాలుగా మెరుగైన లాభాలతో ర్యాలీ చేస్తున్న సూచీలు వారాంతం భారీ నష్టాలను ఎదుర్కొన్నాయి. బెంచ్‌మార్క్ సూచీ సెన్సెక్స్ దాదాపు 700 పాయింట్లు పతనమైంది. శుక్రవారం ట్రేడింగ్‌లో ఉదయం నుంచే నష్టాలతో మొదలైన స్టాక్ మార్కెట్లు మిడ్-సెషన్ తర్వాత మరింత నష్టాల్లోకి మారాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలతో రావడంతో పాటు దేశీయంగా కీలక కంపెనీల షేర్లలో అమ్మకాలు మార్కెట్లపై ఒత్తిడి పెంచాయి.

ముఖ్యంగా దిగ్గజ హెచ్‌డీఎఫ్‌సీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ సహా ఫైనాన్స్, బ్యాంకింగ్ రంగాల్లో భారీ అమ్మకాలు జరిగాయి. గ్లోబల్ మార్కెట్లలో అమెరికాలోని ప్యాక్‌వెస్ట్ బ్యాంక్‌కార్ప్ కూడా పతనం అవనుందనే సంకేతాలు ప్రభావితం చేశాయి. దాంతో అంతర్జాతీయంగా బ్యాంకింగ్ సంక్షోభం మరింత ఒత్తిడి కలిగిస్తుందనే భయాలతో మదుపర్ల సెంటిమెంట్ దెబ్బతిన్నది. దేశీయంగా కూడా ఆయా రంగాల్లో అమ్మకాలు పోటెత్తాయి.

దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 694.96 పాయింట్లు కుదేలై 61,054 వద్ద, నిఫ్టీ 186.80 పాయింట్లు నష్టపోయి 18,069 వద్ద ముగిశాయి. నిఫ్టీలో బ్యాంకింగ్, ఫైనాన్స్ రంగాలు 2 శాతానికి పైగా బలహీనపడ్డాయి. ఎఫ్ఎంసీజీ, కన్స్యూమర్ డ్యూరబుల్స్, ఆటో రంగాలు మాత్రమే రాణించాయి.

సెన్సెక్స్ ఇండెక్స్‌లో టైటాన్, అల్ట్రా సిమెంట్, మారుతీ సుజుకి, నెస్లే ఇండియా, ఐటీసీ, ఏషియన్ పెయింట్, పవర్‌గ్రిడ్ కంపెనీల షేర్లు లాభాలను దక్కించుకున్నాయి. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ, ఇండస్ఇండ్ బ్యాంక్, టాటా స్టీల్, ఎంఅండ్ఎం, ఇన్ఫోసిస్ స్టాక్స్ నష్టాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ. 81.71 వద్ద ఉంది.

Advertisement

Next Story