Stock market: భారీ నష్టాల్లో మార్కెట్లు.. మదుపర్ల సంపద రూ. 8 లక్షల కోట్లు ఆవిరి

by S Gopi |
Stock market: భారీ నష్టాల్లో మార్కెట్లు.. మదుపర్ల సంపద రూ. 8 లక్షల కోట్లు ఆవిరి
X

దిశ, బిజినెస్ బ్యూరో: దేశీయ ఈక్విటీ మార్కెట్లలో వరుస రికార్డు లాభాలకు బ్రేక్ పడింది. గత కొన్ని సెషన్లుగా కొత్త గరిష్ఠాలను తాకుతున్న సూచీలు వారాంతం లాభాల స్వీకరణ కారణంగా భారీ నష్టాలను ఎదుర్కొన్నాయి. శుక్రవారం ఉదయం ప్రారంభం నుంచే బలహీనపడిన సూచీలు ఆ తర్వాత అస్సలు కోలుకోలేదు. అంతర్జాతీయ మార్కెట్ల ప్రతికూల సంకేతాలకు తోడు దేశీయంగా కీలక కంపెనీల షేర్లలో మదుపర్లు లాభాలను వెనక్కి తీసుకోవడం, వచ్చే వారంలో కేంద్ర బడ్జెట్ ఉండటంతో అప్రమత్తంగా వ్యవహరించడం, బ్లూచిప్ కంపెనీల షేర్లలో ర్యాలీ మందగించడం వంటి అంశాలు నష్టాలను పెంచాయి. ఈ క్రమంలోనే ఇన్వెస్టర్ల సంపద శుక్రవారం ఒక్కరోజే రూ. 7.98 లక్షల కోట్లు ఆవిరవగా, బీఎస్ఈ మార్కెట్ క్యాప్ రూ. 446.34 లక్షల కోట్లు చేరింది. దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 738.81 పాయింట్లు పతనమై 80,604 వద్ద, నిఫ్టీ 269.95 పాయింట్లు కుదేలై 24,530 వద్ద ముగిశాయి. నిఫ్టీలో మెటల్, మీడియా, రియల్టీ 2-4 శాతం మధ్య దెబ్బతినగా, మిగిలిన రంగాలు సైతం బలహీనపడ్డాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లో ఇన్ఫోసిస్, ఐటీసీ, ఏషియన్ పెయింట్, హెచ్‌సీఎల్ టెక్ కంపెనీల షేర్లు మాత్రమే లాభాలను దక్కించుకున్నాయి. టాట స్టీల్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, ఎన్‌టీపీసీ, టాటా మోటార్స్, ఆల్ట్రా టెక్ సిమెంట్, టెక్ మహీంద్రా స్టాక్స్ 3 శాతానికి పైగా నష్టాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 83.67 వద్ద ఉంది.



Next Story