Auto industry: FY24లో రూ.6.14 లక్షల కోట్లకు ఆటో విడిభాగాల పరిశ్రమ టర్నోవర్

by Harish |
Auto industry: FY24లో రూ.6.14 లక్షల కోట్లకు ఆటో విడిభాగాల పరిశ్రమ టర్నోవర్
X

దిశ, బిజినెస్ బ్యూరో: దేశీయ ఆర్థికాభివృద్ధికి తోడు వాహన విక్రయాలు క్రమంగా పుంజుకుంటున్నాయి. దీనికి అనుగుణంగా ఆటోమొబైల్ విడిభాగాల తయారీ పరిశ్రమ టర్నోవర్ వేగంగా వృద్ధి చెందుతుంది. 2024 ఆర్థిక సంవత్సరంలో ఈ పరిశ్రమ టర్నోవర్ రూ. 6.14 లక్షల కోట్లకు చేరుకుంది. ఇది గత ఎఫ్‌వై23లో రూ.5.59 లక్షల కోట్లతో పోలిస్తే 9.8 శాతం వృద్ధిని నమోదు చేసింది. ఆటోమోటివ్ కాంపోనెంట్ మ్యానుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ACMA) నుంచి వచ్చిన నివేదిక ప్రకారం, సాధారణ ఆటోమొబైల్ కాంపోనెంట్ అమ్మకాల్లో ఈవీ విడిభాగాల అమ్మకాలు కూడా గతంతో పోలిస్తే ఎక్కువగానే ఉన్నాయి. దేశంలోని మొత్తం కాంపోనెంట్ ఉత్పత్తిలో ఈవీ తయారీ పరిశ్రమ వాటా 6 శాతంగా ఉంది.

దేశం నుంచి మొత్తం ఆటోమొబైల్ కాంపోనెంట్ ఎగుమతులు గత ఏడాది రూ. 1,61,483 కోట్లు కాగా ఇది 5.5 శాతం వృద్ధితో రూ. 1,75,960 కోట్లకు పెరిగింది. అలాగే, దిగుమతులు 3 శాతం వృద్ధితో రూ.1,73,470 కోట్లకు చేరాయి, తద్వారా వాణిజ్య మిగులు $300 మిలియన్లకు చేరుకుంది. ప్రపంచవ్యాప్తంగా భౌగోళిక రాజకీయ సవాళ్ళు, రవాణా ఖర్చులు పెరిగినప్పటికీ ఆటో విడిభాగాల ఎగుమతులు పెరిగాయి. విలువ-ఆధారిత భాగాల వినియోగం పెరగడం, ఉత్పత్తులను స్థానికంగా తయారు చేయడం, పెద్ద-మరింత శక్తివంతమైన వాహనాల వైపు ప్రజల చూపు మారడంతో ఆటో-కాంపోనెంట్స్ సెక్టార్ టర్నోవర్ పెరిగిందని నిపుణులు తెలిపారు. ఎగుమతుల పరంగా చూసినట్లయితే, ఉత్తర అమెరికా ఎగుమతుల్లో 4.5 శాతం వృద్ధి, ఐరోపాకు12 శాతం వృద్ధి చెందగా, ఆసియాకు ఎగుమతులు ఫ్లాట్‌గా ఉన్నాయి.

Advertisement

Next Story