భారీగా పెరిగిన 'మేక్ ఇన్ ఇండియా' ఐఫోన్లు!

by Harish |
భారీగా పెరిగిన మేక్ ఇన్ ఇండియా ఐఫోన్లు!
X

న్యూఢిల్లీ: ప్రీమియం స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ యాపిల్ కంపెనీ 2022లో మేక్ ఇన్ ఇండియా ఐఫోన్‌ల ఎగుమతులు 65 శాతం పెరిగాయని రీసెర్చ్ సంస్థ కౌంటర్‌పాయింట్ తెలిపింది. విలువ పరంగా 162 శాతం వృద్ధి కావడం విశేషం. అలాగే, 2021లో యాపిల్ విలువ పరంగా 12 శాతం వాటా కలిగి ఉండగా, గతేడాదికి ఇది 25 శాతానికి పెరిగింది. దేశీయంగా యాపిల్ ఫోన్‌లకు పెరుగుతున్న గిరాకీని ఈ గణాంకాలు ప్రతిబింబిస్తున్నాయని కౌంటర్‌పాయింట్ రీసెర్చ్ అభిప్రాయపడింది.

ఐఫోన్‌ల తయారీ కోసం భారత్‌లో భాగస్వామ్యం కుదుర్చుకున్న విస్ట్రాన్, ఫాక్స్‌కాన్, పెగాట్రాన్లు గతేడాది చివరి త్రైమాసికంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న తయారీ కంపెనీలుగా నిలిచాయి. ఇటీవలి పరిణామాల్లో వీటిలో కొన్ని సంస్థలు భారత్‌లో తయారీని పెంచేందుకు యాపిల్ నుంచి సూచనలు అందుకున్నట్టు తెలుస్తోంది. అందులో భాగంగానే ఫాక్స్‌కాన్, పెగాట్రాన్ కొత్త ప్లాంట్ల నిర్మాణానికి సిద్ధమవుతున్నాయి.

ఇటీవలే ఫాక్స్‌కాన్ హైదరాబాద్‌లో తయారీ కేంద్రం ఏర్పాటు చేయనున్నట్టు పరిశ్రమ వర్గాలు తెలిపాయి. ఇక, మొత్తంగా మేక్ ఇన్ ఇండియా స్మార్ట్‌ఫోన్ షిప్‌మెంట్లు విలువ పరంగా 2022లో 34 శాతం పెరిగాయని నివేదిక వెల్లడించింది. అలాగే, గతేడాది భారత్ నుంచి అత్యధికంగా 22 శాతం వాటాతో ఒప్పో ఫోన్లు ఎగుమతి అయ్యాయని నివేదిక పేర్కొంది.

Advertisement

Next Story