గ్లోబల్ బ్రాండ్‌గా 'అమూల్ పాలు'.. అమెరికాలో విక్రయాలు

by S Gopi |
గ్లోబల్ బ్రాండ్‌గా అమూల్ పాలు.. అమెరికాలో విక్రయాలు
X

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రముఖ డైరీ బ్రాండ్ అమూల్ ఇకమీదట గ్లోబల్ బ్రాండ్ కానుంది. మొట్టమొదటిసారిగా అమూల్ పాలు భారత్‌కు వెలుపల అందుబాటులో ఉండనున్నాయి. గుజరాత్ కోఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్(జీసీఎంఎంఎఫ్) మరో వారం రోజుల్లో అమెరికాలో నాలుగు రకాల పాల ఉత్పత్తుల అమ్మకాలను ప్రారంభించనుంది. 'దశాబ్దాలుగా పాల ఉత్పత్తులను ఎగుమతి చేస్తున్నాం. భారత్‌కు వెలుపల తాజా పాలను మార్కెట్లో విడుదల చేయడం ఇదే మొదటిసారి' అని జీసీఎంఎంఎఫ్ ఎండీ జాయెన్ మెహతా తెలిపారు. అమెరికా మార్కెట్లో తాజా పాలను విక్రయించేందుకు 108 ఏళ్ల సహకార సంస్థ మిచిగాన్ మిల్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్(ఎంఎంపీఏ)తో ఒప్పందం కుదుర్చుకున్నామని ఆయన చెప్పారు. పాల సేకరణ, ప్రాసెసింగ్ ప్రక్రియ మొత్తం ఎంఎంపీఏ నిర్వహిస్తుంది. అమూల్ పాల మార్కెటింగ్, బ్రాండింగ్‌ను కూడా చేస్తుంది. 'రెసిపీ మాదే ఊంటుంది. మరో వారం రోజుల్లో అమూల్ తాజా, అమూల్ గోల్డ్, అమూల్ శక్తి, అమూల్ స్లిమ్ ఎన్ టిమ్ ఉత్పత్తులు యూఎస్ మార్కెట్లో లభిస్తాయని మెహతా తెలిపారు. ఇవి న్యూయార్క్, న్యూజెర్సీ, చికాగో, వాషింగ్టన్, డల్లాస్, టెక్సాస్‌లలో లభిస్తాయి. ప్రవాస భారతీయులు(ఎన్ఆర్ఐ), ఆసియా ప్రజలను దృష్టిలో ఉంచుకుని ఈ భాగస్వామ్యం చేసుకున్నామని ఆయన వెల్లడించారు. రాబోయే 3-4 నెలల పాటు బ్రాండింగ్, మార్కెటింగ్‌పై దృష్టి సారిస్తాం. భవిష్యత్తులో పనీర్, పెరుగు, మజ్జిగ వంటి పాల ఉత్పత్తులను కూడా ప్రారంభిస్తామని మెహతా చెప్పారు. కాగా, అమూల్ ఇప్పతికే దాదాపు 50 దేశాల్లో పాల ఉత్పత్తులను ఎగుమతి చేస్తోంది.

Advertisement

Next Story