Salary: ఈ ఏడాది 9.2 శాతం పెరగనున్న వేతనాలు

by S Gopi |
Salary: ఈ ఏడాది 9.2 శాతం పెరగనున్న వేతనాలు
X

దిశ, బిజినెస్ బ్యూరో: ఈ ఏడాది వివిధ రంగాల ఉద్యోగుల జీతాలు స‌గ‌టున 9.2 శాతం పెర‌గ‌వ‌చ్చ‌ని అయాన్ క‌న్స‌ల్టింగ్ సంస్థ స‌ర్వే తెలిపింది. అంతర్జాతీయంగా అనిశ్చిత పరిస్థితులు, వృద్ధి నెమ్మదించిన నేపథ్యంలో దేశీయంగా గతేడాది కంటే జీతాల పెరుగుదల స్వల్పంగా తగ్గింది. 2024లో వివిధ రంగాల ఉద్యోగుల సగటున 9.3 శాతం పెరిగాయి. కొవిడ్-19 మహమ్మారి తర్వాత 2022లో పెద్ద ఎత్తున ఉద్యోగాలు రాజీనామాలకు దిగారు. ఆ సమయంలో కంపెనీలు ఉద్యోగులకు సగటున 10.6 శాతం జీతాలను పెంచాయి. ఆ తర్వాత నుంచి వేతన పెరుగుదల క్రమంగా తగ్గుముఖం పడుతోందని అయాన్ అభిప్రాయపడింది. అత్యధికంగా ఇంజనీరింగ్ డిజైన్, నాన్-బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలు, రిటైల్, గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లు, లైఫ్ సైన్సెస్ విభాగాల్లో పనిచేసే ఉద్యోగులకు అధిక జీతాలు అందుతాయని నివేదిక తెలిపింది. గ్లోబల్ పరిణామాలు ప్రతికూలంగా ఉన్నప్పటికీ, దేశీయంగా గ్రామీణ ప్రాంతాల్లో డిమాండ్ మెరుగుపడటం, ప్రైవేట్ వినియోగం ఊపందుకోవడం కొంత సానుకూలంగా ఉంది. భౌగోళిక రాజకీయ పరిస్థితులు, ఆర్థిక అంశాలు, అమెరికా వాణిజ్య విధానాలు, మధ్యప్రాచ్యంలో ఘర్షణలు, ఏఐ పురోగతి వంటి అంశాల కారణంగా జీతాల పెంపుపై ప్రభావం కనిపిస్తోందని నిపుణులు తెలిపారు. మరోవైపు, దేశవ్యాప్తంగా అట్రిషన్ రేటు తగ్గుతోందని అయాన్ నివేదిక వెల్లడించింది. 2022లో అత్యధికంగా 21.4 శాతంగా ఉన్న అట్రిషన్ రేటు 2023లో 18.3 శాతానికి, 2024లో 17.7 శాతానికి దిగొచ్చింది. స్కిల్స్ ఉన్న ఉద్యోగుల లభ్యత మెరుగ్గా ఉండటం, స్వయం ఉపాధి, కంపెనీల కార్యకలాపాలు పెరిగిన కారణంగా అట్రిషన్ రేటు తగ్గుతోందని నివేదిక పేర్కొంది.

Next Story

Most Viewed