Air India: పాత విమానాలకు కొత్త హంగులు దిద్దుతున్న ఎయిర్ ఇండియా

by Harish |
Air India: పాత విమానాలకు కొత్త హంగులు దిద్దుతున్న ఎయిర్ ఇండియా
X

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రపంచ విమానయాన సంస్థల్లో అగ్రగామిగా ఎదగాలని చూస్తున్న దేశీయ ఎయిర్‌లైన్ సంస్థ ‘ఎయిర్‌ ఇండియా’ తన పాత విమానాలను విలాసవంతమైన సీట్లు, ఆధునిక లైట్లు, ఇతర సదుపాయాలతో అప్‌గ్రేడ్ చేయడానికి సిద్ధమైంది. 67 పాత విమానాలను అప్‌గ్రేడ్ చేసే కార్యక్రమాన్ని తాజాగా ప్రారంభించింది. దీని కోసం దాదాపు రూ.3,350 కోట్ల($400 మిలియన్ల)ను కేటాయించింది. మొదట 27 నారో బాడీ ఎయిర్‌బస్ A320neo విమానాలతో ప్రారంభించి, తర్వాత 40 వైడ్ బాడీ బోయింగ్ విమానాలను అప్‌గ్రేడ్ చేస్తారు. తన ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించడమే లక్ష్యంగా విడతల వారీగా విమానాలను అప్‌గ్రేడ్ చేసే పనిని మొదలు పెట్టంది.

సీట్లు, కార్పెట్‌లు, కర్టెన్‌లు, అప్‌హోల్‌స్టరీలు, ఇతర క్యాబిన్ ఇంటీరియర్స్‌ను ప్రయాణికులకు మరింత మెరుగైన ప్రయాణ అనుభవాన్ని ఇచ్చే విధంగా మారుస్తున్నారు. నెలకు మూడు నుంచి నాలుగు నారోబాడీ విమానాలను అప్‌గ్రేడ్ చేసే అవకాశం ఉంది. 2025 మధ్య నాటికి పూర్తి నారోబాడీ ఫ్లీట్‌ అప్‌గ్రేడ్ పూర్తవుతుంది. మొదటగా A320neo ఎయిర్‌క్రాఫ్ట్‌‌ను అప్‌గ్రేడ్ చేసే పనిని ప్రారంభించారు. దీనిలో బిజినెస్ క్లాస్‌లో ఎనిమిది లగ్జరీ సీట్లు , ప్రీమియం ఎకానమీలో 24 అదనపు లెగ్‌రూమ్ సీట్లు, ఎకానమీలో 132 సౌకర్యవంతమైన సీట్లు, విశాలమైన లెగ్‌రూమ్, ఆధునిక లైటింగ్, చార్జింగ్ కోసం USB పోర్ట్ వంటి సదుపాయాలను ఏర్పాటు చేస్తున్నారు.

అలాగే, ఎయిర్ ఇండియా తన 40 పాత వైడ్‌బాడీ బోయింగ్ 787, 777 విమానాల ఇంటీరియర్‌లను పూర్తిగా అప్‌గ్రేడ్ చేయడానికి సన్నాహాలు చేస్తోంది. అంతా అనుకున్నట్లు జరిగితే, మొదటి వైడ్‌బాడీ ఎయిర్‌క్రాఫ్ట్ 2025 ప్రారంభంలో అప్‌గ్రేడ్ పనులు ప్రారంభించవచ్చు.

Advertisement

Next Story

Most Viewed