భారత్‌లో ప్యాసింజర్ వాహన టైర్ల తయారీపై 'మెషిలిన్' దృష్టి!

by Aamani |
భారత్‌లో ప్యాసింజర్ వాహన టైర్ల తయారీపై మెషిలిన్ దృష్టి!
X

న్యూఢిల్లీ: భారత మార్కెట్లో ప్యాసింజర్ వాహనాల టైర్ల ఉత్పత్తిని ప్రారంభించనున్నట్టు ప్రముఖ ఫ్రెంచ్ టైర్ తయారీ దిగ్గజం మెషిలిన్ ఆదివారం ప్రకటనలో వెల్లడించింది. ప్రస్తుతానికి దానికి సంబంధించి పరిశీలనలు జరుగుతున్నాయని, భారత్‌ను వేగంగా అభివృద్ధి చెందుతున్న మార్కెట్‌గా చూస్తున్నామని కంపెనీ సీఈఓ ఫ్లరెంట్ మెనెగాక్స్ చెప్పారు. దేశంలో ప్యాసింజర్ వాహనాల టైర్ల స్థానిక ఉత్పత్తికి అవసరమైన పెట్టుబడులు, అందుకు కావాల్సిన చర్యలపై దృష్టి సారిస్తామని ఆయన పేర్కొన్నారు. కంపెనీ ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో పెట్టుబడులు పెట్టింది. భారత్‌లో స్థానిక ఉత్పత్తికి కొంత ఆలస్యం జరిగింది.

ఈ సమస్యను పరిష్కరించే దిశగా ప్రయత్నిస్తున్నామని ఫ్లరెంట్ తెలిపారు. సరైన మౌలిక సదుపాయాలతో భారత మార్కెట్ అత్యంత వేగంగా అభివృద్ధి జరుగుతోంది. ఈ తరుణంలో దేశీయంగా తయారీని చేపట్టే ప్రక్రియను వేగవంతం చేస్తామని స్పష్టం చేశారు. కాగా, ఫ్రెంచ్‌కు చెందిన టైర్ తయారీ దిగ్గజం 175 దేశాల్లో 67 ప్లాంట్లను కలిగి ఉంది. ప్రస్తుతం భారత్‌లో పెద్ద సైజ్ టైర్లను మాత్రమే విక్రయిస్తోంది. ట్రక్, బస్సులకు అవసరమైన టైర్ల విభాగంలో మెరుగైన అమ్మకాలను సాధిస్తోంది. అయితే, 2020లో ప్రభుత్వం స్థానిక తయారీని ప్రోత్సహించే లక్ష్యంతో దిగుమతి ఆంక్షలు విధించడంతో మెషిలిన్ కంపెనీ దేశంలో కార్యకలాపాలను, ఉత్పత్తిని చేపట్టాలని నిర్ణయించింది.

Advertisement

Next Story

Most Viewed