31 లక్షల మందికి రీఫండ్లు ఆలస్యం!

by Harish |   ( Updated:2023-08-24 15:27:27.0  )
31 లక్షల మందికి రీఫండ్లు ఆలస్యం!
X

న్యూఢిల్లీ: ప్రతి ఏటా ఆదాయపు పన్ను రిటర్నులను దాఖలు చేసిన అనంతరం తప్పనిసరిగా ఈ-వెరిఫికేషన్ చేయడం తప్పనిసరి. ఈ ప్రక్రియ ఐటీ రిటర్నులను దాఖలు చేసిన 30 రోజుల్లోగా పూర్తి చేయాల్సి ఉంటుంది. అయితే, పన్ను చెల్లింపుదారులు రిటర్నులను దాఖలు చేసినప్పటికీ ఈ-వెరిఫై చేయలేదని ఐటీ శాఖ తెలిపింది.

సాధారణంగా ఆదాయపు పన్ను చట్టంలోని నిబంధనల ప్రకారం, ఐటీ రిటర్నులు చేసిన అందరూ ఈ-వెరిఫై చేయాలి. ఒకవేళ చేయకపోతే సదరు రిటర్నులకు సంబంధించి ట్యాక్స్ రీఫండ్ల సొమ్ము పొందలేరు. తాజా ఐటీ శాఖ వివరాల ప్రకారం ఈ నెల 23 నాటికి 31 లక్షల మంది పన్ను చెల్లింపుదారులు ఐటీ రిటర్నులను దాఖలు చేసిన తర్వాత ఈ-వెరిఫై చేయలేదు.

ఆదాయ పన్ను శాఖ అధికారిక వెబ్‌సైట్ వివరాల ఆధారంగా చూస్తే, ఆగస్టు 23వ తేదీ నాటికి 6.91 కోట్ల ఐటీ రిటర్నులు రాగా, అందులో 6.59 కోట్ల మంది మాత్రమే ఈ-వెరిఫై చేశారు. ఈ-వెరిఫై కోసం ఉన్న 30 రోజుల గడువు ప్రక్రియ ముగుస్తున్న వేళ పన్ను చెల్లింపుదారులందరూ తమ ఐటీఆర్ వెరిఫై చేసుకోవాలని ఐటీ విభాగం స్పష్టం చేసింది.

ఒకవేళ గడువులోగా ప్రక్రియ పూర్తి చేయకపోతే లేట్ ఫీజు చెల్లించాల్సి ఉంటుందని, తద్వారా రీఫండ్లు మరింత ఆలస్యమవుతాయని, కొన్ని సందర్భాల్లో ఆయా ఐటీ రిటర్నులు ఇన్‌వాలిడ్‌గా పరిగణించవచ్చని తెలిపింది.

Advertisement

Next Story